నమస్తే తెలంగాణ ప్రతినిధి (నిజామాబాద్) / లింగంపేట, సెప్టెంబర్19 : మరుగున పడిన వారసత్వ సంపదకు ‘నమస్తే తెలంగాణ’ కారణంగా పునరుజ్జీవం దక్కింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక కట్టడం తిరిగి పూర్వవైభవం సాధించింది. లింగంపేట మండల కేంద్రంలో గల పురాతన కట్టడమైన నాగన్న బావి ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మెట్ల బావిపై ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో చారిత్రక కట్టడం శిథిలావస్థకు చేరింది. నాగన్నబావి దుస్థితిని, వారసత్వ సంపద దురావస్థను ‘నమస్తే తెలంగాణ’ ప్రపంచానికి చాటి చెప్పింది. 2020 మే 28న ప్రధాన సంచికలో ‘వావ్.. తెలంగాణ రాణికీ వావ్’ శీర్షికన ప్రచురిచితమైన ఆ కథనం పురాతన బావికి పట్టిన నిర్లక్ష్యపు
చెదలును చెరిపేసింది. ఐదు అంతస్తులు, అష్టదిక్కులతో నిర్మితమైన ఈ అద్భుతమైన కట్టడం తిరిగి పూర్వవైభవం సాధించేలా చేసింది.
నమస్తే ప్రచురించిన కథనం ఎందరిలోనో స్పందన తీసుకొచ్చింది. ప్రధానంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బాధ్యులు, పలువురు చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు కదిలొచ్చాయి. మెట్ల బావిని సందర్శించి అద్భుతమైన శిలా సంపదను, రాతి కట్టడం మహాత్యాన్ని పరిశీలించి, పునర్వైభవం తెచ్చే దిశగా చర్యలు ప్రారంభించాయి. బావి చరిత్రను ఆర్కియాలజిస్టులు, అధికారులు అప్పటి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌కు వివరించారు. దీంతో ముగ్ధుడైన ఆయన పలుమార్లు బావిని సందర్శించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నాగన్నబావి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. నాగన్న బావి అభివృద్ది కోసం స్వచ్ఛంద సంస్థ రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనారమేశ్కు దృష్టికి తీసుకెళ్లగా, అమె కూడా పలుమార్లు సందర్శించి అభివృద్ధి పనులు ప్రారంభించారు.
నాగన్న బావి అభివృద్ధి చేయడానికి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారం తీసుకున్నారు. కలెక్టర్‌తో పాటు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు శ్రమదానం చేసి పూడికతీత పనులు చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో పరసరాలను శుభ్రం చేయించారు. బావి పై భాగంలో, అంతర్భాగంలో మొలచిన చెట్లను తొలగించారు. శిథిల దశకు చేరిన చారిత్ర కట్టడాలను తిరిగి యథావిధిగా నిర్మాణం చేయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తమిళనాడు రాష్ర్టానికి చెందిన వారిని పిలిపించారు. కేంద్ర నోడల్ బృందం సభ్యులు సైతం పునరుద్ధరణ పనులకు సహకరించారు. కలెక్టర్ పాటిల్ బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో వచ్చిన ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సైతం నాగన్నబావిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి, అభివృద్ధి పనులకు సహకరించారు.
చారిత్రక మెట్లబావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టారు. బావి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఆహ్లాదం పంచడానికి పూల మొక్కలు నాటించారు. హైమాస్ట్ లైట్లను బిగించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి నాగన్న బావి వద్దకు వెళ్లడానికి ప్రత్యేకంగా రహదారి వేశారు. బావి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి తుది మెరుగులు దిద్దారు. పూర్వవైభవం సంతరించుకున్న నాగన్నబావిని నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనారమేశ్ తదితరులు ప్రారంభోత్సవానికి హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్‌రావు బుధవారం పరిశీలించారు.