ఖలీల్వాడి, ఫిబ్రవరి 13: అదానీ అక్రమాలపై విచారణ చేపట్టాలని సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లాకేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడారు. అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ అండదండలతో ప్రపంచంలోనే రెండో కుబేరుడిగా ఎదిగిన అదానీ.. అవినీతితో ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆరోపించారు. ఎల్ఐసీ నుంచి రూ.80 వేల కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రూ.5,300 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.7 వేల కోట్లు, ఎస్బీఐ నుంచి రూ.25 వేల కోట్లు ఇలా అనేక బ్యాంకుల నుంచి అదానీ కంపెనీల్లో మోదీ ఆదేశాలతోనే పెట్టుబడులు పెట్టినట్లు బహిర్గతమవుతున్నదని అన్నారు.
ఈ కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత అదానీ ఆర్థిక సామ్రాజ్యం పేకమేడల్లా కూలిపోయిందని, దీంతో దేశ సార్వభౌమత్వ నిర్మాణానికి పెద్ద దెబ్బ తగిలిందన్నారు. ఈ నష్టం అదానీది కాదని, దేశ ప్రజలదని పేర్కొన్నారు. ఎల్ఐసీకి దాదాపు రూ. 40 వేల కోట్లు, ఎస్బీఐ కి రూ.9 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పది లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే అదానీ కంపెనీల్లో ఆవిరైపోయిందన్నారు. ఆ నష్టం ఇంతటితో ఆగే పరిస్థితి కనబడడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై విచారణ చేపట్టాలన్నారు. దేశంలోని అన్ని పార్టీలతో కూడిన జా యింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డి మాండ్ చేస్తున్నప్పటికీ.. మోదీ ఈ కుంభకోణాన్ని దేశంలో జరిగింది కాదనే రీతిలో వ్యవరిస్తున్నారని మండిపడ్డారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఇటీవల ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్లో పేదవాడిని మరింత పేదరికంలోకి నెట్టివేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. విద్య, వైద్యం కోసం నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ధర్నాలో సీపీఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, కె.రాజన్న, రఘురాం, రంజిత్, అంజలి, బొంబాయి గంగాధర్, పి.హన్మాండ్లు, అలీ తదితరులు పాల్గొన్నారు.