పెద్ద కొడప్గల్ : హరితహారం చెట్లను నరికి వేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎల్పీవో నాగరాజు (DLPO Nagaraju ) తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రం సబ్ స్టేషన్ సమీపంలోని కాటేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న హరితహారం (Haritha Haram) చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. ‘ నమస్తే తెలంగాణ పత్రికలో హరితహారం చెట్లకు నరికివేత ’ అనే శీర్షిక ప్రచురితం కావడంతో శుక్రవారం అధికారులు స్పందించి నరికి వేసిన చెట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎల్పీవో నాగరాజు మాట్లాడుతూ అనుమతులు లేకుండా హరితహారం చెట్లు నరికి వేసిన సదరు వ్యక్తితో పాటు జేసీబీ యజమాని, విద్యుత్ శాఖ, పంచాయతీ, చెట్ల నరికివేత కారణమైన అందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు. అనుమతులు లేకుండా చెట్లు నరికి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి కాంత్ రెడ్డి, ఏపీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.