భిక్కనూరు, ఏప్రిల్ 11: అంబులెన్స్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని జాతీయ రహదారి-44పై రామేశ్వర్‌పల్లి బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం రాకాసీపేట్‌కు చెందిన షేక్ సర్ధార్(33) నడుపుతున్న అంబులెన్స్‌లో రోగి శైలేహభాను(63), ఆమె భర్త హైపుల్లాఖాన్ను హైదరాబాద్ నుంచి తీసుకొని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై అంబులెన్స్‌ను వెనుక నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నది. దీంతో సర్ధార్, శైలేహభాను అక్కడికక్కడే మృతిచెందగా.. హైఫుల్లాఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ కాపీని ఫిర్యాదుదారుడికి అందజేసినట్లు పేర్కొన్నారు.