 
                                                            కామారెడ్డి, జూలై 4: ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాకి ఉంటుంది. వి ద్యార్థులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు పాఠశాలలు, కళాశాలలు వేదికగా నిలుస్తాయి. ప్రజల కొత్త ఆలోచనల ద్వా రా ప్రాజెక్టుల రూపకల్పన, సృజనాత్మకతలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇం టింటా ఇన్నోవేటర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 2019 స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొవిడ్ నేపథ్యంలో నాలుగేండ్లుగా ఆన్లైన్ ద్వారానే ప్రదర్శనలు ఇవ్వడం ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్లైన్ ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ఈ ఆవిష్కరణలను తిలకించే అవకాశమున్నది. సామాజిక అంశాల పరిష్కారమే లక్ష్యంగా వారి ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి ప్రయోగ రూపకల్పనకు 2023-24 సంవత్సరానికి జిల్లాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ప్రతి ఒక్కరికీ అవకాశం…
ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేటర్ సెల్‌ను ఏర్పాటు చేసింది. సామాన్య గృహి ణి నుంచి పాఠశాలలు, కళాశాల స్థాయి విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదారులు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ప్రతి వ్యక్తిలోని ఆలోచనను, ప్రతిభను వెలికితీసి స్థానిక సమస్యలకు వాటితో పరిష్కారం కనుగొనే విధంగా ప్రోత్సహించనున్నారు. ఎంపిక చేసిన ఐదు ఆవిష్కరణలను ఆగష్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంపిక చేస్తారు. అదే రోజు వాటిని ఆన్లైన్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇందులో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి న వారికి రూ.లక్ష వరకు నగదు బహుమతి అందజేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల నుంచి ఒక ఆవిష్కరణను తప్పనిసరిగా పంపించేందుకు ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాల్సి ఉంటుంది.
ఆవిష్కరణ అంటే..
ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, ఒక కార్యక్రమం లేక మనలో కలిగే సృజనాత్మకత ఆలోచనే ఆవిష్కరణ. ఇలా ఆవిష్కరణ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంతోపాటు సమగ్ర అవగాహన కలిగి ఉండడం ఆవిష్కరణకు దారితీస్తుంది. మన చుట్టూ ఉండే సమస్యలకు సంబంధించి వినూత్నంగా ఆలోచించి పరిష్కారానికి అవలంబించే పద్ధతి సైతం ఆవిష్కరణ అనిపించుకుంటుంది. సమస్య పరిష్కారానికి ఏదైనా వస్తువును విభిన్నంగా తయారు చేయగలిగిన వారే ఆవిష్కర్తలుగా గుర్తించబడుతారు. వారిలోని ప్రతిభను సమాజానికి తెలియజేసేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
వాట్సాప్ ద్వారా..
తమ ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసిన ప్రాజెక్ట్ విషయాలతో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందించే ముందు ఇందుకు సంబంధించిన ఆరు వ్యాక్యాలతో కూడిన ఆవిష్కరణ వివరణ, రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, మొబైల్ నంబర్, ప్రస్తుత వృత్తి, పూర్తి వివరాలు, అడ్రస్‌ను 91006 78543 నంబర్ వాట్సాప్‌కు పంపించవచ్చు. వచ్చిన ఆవిష్కరణల అంశాల నుంచి ఉత్తమమైనవి ఎంపిక చేసి ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించనున్నారు. ఇందులో పాల్గొన్న వారికి కలెక్టర్ చేతుల మీదుగా టీఎస్ఐసీ హైదరాబాద్ వారిచే ప్రశంసా పత్రాలను అందజేస్తారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇది మంచి అవకాశం. దీనిని యువకులు, విద్యార్థులు, రైతులు, శాస్త్రవేత్తలు అన్నివర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా సందేహాలుంటే 94404 14250 నంబర్లో సంప్రదించాలి.
– సిద్ధిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, కామారెడ్డి
 
                            