వినాయక నగర్ : నిజామాబాద్ ఆర్టీవో కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీవో కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల ట్రాన్స్ఫర్, డ్రైవింగ్ లైసెన్సులు, లైసెన్సుల రెన్యువల్ తదితర పనులు జరగాలంటే ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
దాంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ కుడా ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీవో కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి, లోపల ఉన్న ప్రైవేటు వ్యక్తులను బయటకు వెళ్ళనివ్వకుండాతనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఏదైనా పనుల నిమిత్తం కార్యాలయానికి వెళ్తే నేరుగా పనులు జరగడంలేదని, మధ్యవర్తులుగా బ్రోకర్లు వ్యవహరిస్తూ డబ్బులు దండుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ దాడులు చేసింది.
దాదాపు కొన్ని గంటలపాటు ఆర్టీవో కార్యాలయంలో సోదాలు జరిగాయి. కార్యాలయం లోపల ఉన్న ఏజెంట్లతోపాటు సిబ్బందిని సైతం తనిఖీ చేస్తూ విచారణ నిర్వహిస్తున్నారు.