భిక్కనూరు, జూలై 16:కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని పొందుర్తి వద్ద గల ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.53 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సోదాలు చేస్తున్న సమయంలోనే కొందరు డ్రైవర్లు వచ్చి చెక్‌పాయింట్‌లో డబ్బులు ఇచ్చివెళ్లడం విశేషం. ఆర్టీఏ చెక్‌పాయింట్ వద్దకు వచ్చే అనేక మంది డ్రైవర్లు క్రమం తప్పకుండా నగదు చెల్లిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీర్ఘకాలం నుంచి వ్యవస్థీకృతంగా ఈ వసూళ్ల విధానం కొనసాగుతున్నదని తెలిపారు.
తనిఖీల సమయంలో చెక్ పాయింట్ నుంచి రూ.23 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏఎంవీఐ సామ్ రిచర్డ్సన్ నుంచి లెక్కల్లో చూపని రూ.16 వేలు, అలాగే, ఓ ఫైల్లో దాచిన రూ.4 వేలు, ప్రైవేట్ ఏజెంట్ శివకుమార్ వద్ద నుంచి రూ.9 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఐదుగురు ప్రైవేట్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అందులో నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో 20 రోజుల వ్యవధిలో రెండు ఆర్టీఏ చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. గతనెల 26వ తేదీన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్‌పోస్టుపై దాడిచేశారు. అక్కడ ఏఎంవీఐ కవిత, కానిస్టేబుల్ మొయినుద్దీన్ విధులు నిర్వహిస్తుండగా.. అక్రమంగా ఉన్న రూ.90వేలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పొందుర్తి చెక్‌పోస్టుపై బుధవారం దాడులు నిర్వహించి రూ.53 వేల నగదును స్వాధీనం చేసుకొని, అక్కడ ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు సలాబత్పూర్, నిజామాబాద్ జిల్లాలోని సాలూర చెక్పోస్టులపై ఏసీడీ అధికారులు రైడ్ చేసినా.. పొందుర్తి చెక్‌పోస్టు వైపునకు కన్నెత్తి చూడలేదు. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడిచేసినా లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చెక్‌పోస్టుల వద్ద ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని, లారీ డ్రైవర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఆర్టీఏ అధికారులు అక్రమ వసూళ్లు నిత్యం లక్షల్లో ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులు దాడిచేసిన సమయంలోనే వారి వద్ద లెక్క లేని డబ్బు రూ.వేలల్లో లభిస్తున్నది. దీంతో వారికి నిత్యం లక్షల రూపాయలు అక్రమంగా చేకూరుతున్నాయని తెలుస్తున్నది. దాడి చేసిన సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ వసూలు షరామామూలుగా మారింది.