వినాయక్‌నగర్, నవంబర్ 14: నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు రిజిస్ట్రార్ ఆఫీసుకు లోపలికి వెళ్లి.. గేట్లు మూసివేశారు. దీంతో ఏం జరుగుతుందోనని అధికారులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారు ఉలిక్కి పడ్డారు.
గేట్లకు తాళం వేసి.. లోపల ఉన్న సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన వారికి బయటికి వెళ్లకుండా కట్టడి చేశారు. బయటి వ్యక్తులను కూడా లోపలికి రానివ్వలేదు. కార్యాలయంలోని డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏమైనా అక్రమ డాక్యుమెంట్స్ ఉన్నాయా..? నకిలీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా..? అనే కోణంలో సోదాలు చేశారు.
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. ఏమైనా అవకతవకలు జరిగినట్లు తేలితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బందితోపాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నిత్యం కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. శుక్రవారం నాటి దాడులతో వెలవెలబోయింది.
వినాయక్‌నగర్, నవంబర్ 14: నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిన వెంటనే ఆ బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల దుకాణాలకు తాళాలు పడ్డాయి. దాడులు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో కార్యాలయ బిల్డింగ్‌లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసులకు నిర్వాహకులు తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రాంతంలో ఉన్న షట్టర్లకు తాళం వేయడంతో కాంప్లెక్స్ మొత్తం ఖాళీ అయినట్లు కనిపించింది. కాగా.. పనుల నుంచి రైటర్ల వద్దకు వచ్చిన వారిని సైతం అక్కడి నుంచి నిర్వాహకులు పంపించివేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందం ఎక్కడ తమ దుకాణాలపై పడుతుందో అనే భయంతో డాక్యుమెంట్ రైటర్లు క్షణాల్లో కనుమరుగైపోయారు.