మద్నూర్, జూన్ 26: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఏ ఒక్క అధికారిపై కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు చేసినా.. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. అధికారులు దాడిచేసిన సమయంలో అధికారులు నియమించుకున్న ప్రైవేటు వ్యక్తులు పారిపోవడం, విధులు నిర్వహించే అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది.
ఏసీబీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. అధికారులు నియమించుకున్న ప్రైవేటు వ్యక్తులు మళ్లీ అక్కడికి చేరుకొని యథావిధిగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదివరకు దాడులు నిర్వహించినా.. ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఇండ్లలో సోదాలు చేస్తే.. వాళ్లు ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి కొట్టి, అక్రమంగా ఎంత సంపాదించారనే విషయాలు తెలుస్తాయని ప్రజలు అంటున్నారు. కేవలం చెక్‌పోస్టుపై దాడిచేస్తే ఏమి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏసీబీ అధికారులు వాళ్ల పని వారు చేసుకుంటే.. మా పని మేము చేసుకుంటాం.. అన్నట్లు ఉన్నది ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది తీరు.
మద్నూర్, జూన్ 26: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై బుధవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడిచేశారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తమ సిబ్బందితో కలిసి సోదాలు చేశారు. గురువారం ఉదయం పది గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.91వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉన్నదన్నారు. ఈ మేరకు దాడులు నిర్వహించినట్లు చెప్పారు. తాము దాడిచేసిన సమయంలో ఏఎంవీఐ కవిత, కానిస్టేబుల్ మొయినుద్దీన్ విధుల్లో ఉన్నారని తెలిపారు. అక్కడ వీరు ఏర్పాటు చేసిన డబ్బాలో రూ.39వేలను లారీ డ్రైవర్లు వేశారని చెప్పారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల్లో ఒకరి వద్ద రూ.28 వేలు, మరొకరి వద్ద రూ.24వేలు లభించాయన్నారు.
వీరు అక్రమంగా వసూలు చేసిన డబ్బులతో ప్రభుత్వానికి రూ.91 వేల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తాము సోదాలు నిర్వహిస్తున్న సమయంలో సిబ్బంది నిద్రలో ఉన్నారని, ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డబ్బులు వసూలు చేసిన ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరికొందరు పరారయ్యారని, వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. సోదాల్లో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగేశ్, వేణుకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పదేండ్ల క్రితం అనగా సెప్టెంబర్ 8, 2015లో ఏసీబీ అధికారులు చివరిసారి దాడిచేశారు. అప్పటి నుంచి నేటి వరకు అటువైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. అది ఇక్కడ విధులు నిర్వహించే వారికి కలిసొచ్చింది. అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ.. కోట్లకు పడగలెత్తారు.
పదేండ్లుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో, ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి భయం లేకుండా పోయింది. దీంతో అందినకాడికి దండుకోవడం నేర్చుకున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమంగా సంపాదించడానికి అలవాటు పడ్డారు. సలాబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పెద్ద పెద్ద నగరాల్లో బంగళాలు కొనుక్కొని విలాసవం తమైన జీవితాన్ని గడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదివరకు సలాబత్పూర్ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలోనే అక్రమంగా వసూలు చేసిన డబ్బులు లభించాయి. 2013 అక్టోబరు 9న జరిగిన దాడుల్లో ఏఎంవీఐతోపాటు ఏజెంట్ వద్ద రూ.33,500 నగదు లభించింది. 2014 సెప్టెంబరు 17న నిర్వహించిన దాడుల్లో రూ.34,160నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
2015 ఫిబ్రవరి 10న దాడి చేయగా రూ.50,700 నగదు లభించింది. చివరగా 2015 సెప్టెంబర్ 8న నిర్వహించిన దాడుల్లో 44,200 నగదును అధికారులు స్వాధినం చేసుకున్నారు. ఇన్నిసార్లు దాడిచేసినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.