రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు మీ సేవా, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఆధార్ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులు కావడం, ఆ తర్వాత వాటిని అప్డేట్ చేయకపోవడంతో చాలా మంది అప్డేట్తోపాటు మార్పులు, చేర్పులు కోసం ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మున్ముందు మరిన్ని సర్టిఫికెట్లు అవసరమవుతాయేమోనని ఇప్పటి నుంచే జనం మీ సేవా కేంద్రాలకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఖలీల్‌వాడి/ రాజంపేట్, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన అమలుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద కన్నా ఆధార్ కేంద్రాల వద్దనే జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆధార్‌లో మార్పులు, చేర్పుల కోసం ఒక్కసారిగా జనం క్యూ కట్టడంతో ఆధార్ సెంటర్ల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు ప్రతి నెలా రూ. 2500, అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల అమలుకు ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకునే దరఖాస్తులో కచ్చితంగా ఆధార్ కార్డు నంబరే కీలకంగా మారింది. తప్పనిసరిగా ఆధార్ నంబరు నమోదు చేయాల్సి ఉన్నది.
2014లో పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2016లో జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టి 2019 వరకు మొత్తంగా 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త మండలాలూ ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పడి ఏండ్లు గడిచినా ఆధార్‌లో కొత్త అడ్రస్‌ను అప్డేట్ చేసుకోలేదు. ఇప్పటికీ చాలామంది ఆధార్ కార్డులపై పాత అడ్రస్‌లే ఉన్నాయి. ఈ కొత్త అడ్రస్‌ల మార్పిడి ఈ ఆరు గ్యారెంటీలకు అడ్డంకి కాకపోయినా కొత్తగా పెండ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చి ఏండ్లు గడిచినా, అడ్రస్ మార్చుకోకపోవడం ద్వారా అత్తగారింటి వద్ద ఈ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతున్నది. అందుకే ఆధార్‌లో అడ్రస్ మార్చుకొని ఈ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆధార్ సెంటర్లకు వెళ్లే వారిలో కొత్తగా పెండ్లి అయిన వారే అధికంగా ఉండడం గమనార్హం.
రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చేందుకు ఆధార్ కీలకం కానున్నది. ఇన్నాళ్లూ పిల్లలకు ఆధార్ తీయని వారు సైతం ఇప్పుడు సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఐదారేండ్ల పిల్లలతోపాటు ఇటీవల జన్మించిన వారికి సైతం ఆధార్ తీసేందుకు బారులుతీరుతున్నారు. ఒక్కో సెంటర్ వద్ద రోజుకు కేవలం వందలోపు అప్లికేషన్లు మాత్రమే స్వీకరించేందుకు అవకాశముండగా, తెల్లవారేసరికి ఆధార్ కేంద్రాల వద్ద వందలాది మంది క్యూలో నిల్చుంటున్నారు.
నూతన మండలంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఇప్పటి వరకు ఆధార్ సెంటర్ లేకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్ల క్రితం మీసేవా నిర్వాహకుడికి ఆధార్ సెంటర్ మంజూరు చేయగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ యూఐడీఏఐ విధివిధానాలతో జాప్యం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. త్వరితగతిన ఆధార్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలనే అపోహతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులుతీరుతున్నారు. రూ.500కే సిలిండర్ పథకానికి, ఈ-కేవైసీకి సంబంధం లేదని అధికారులు చెబుతున్నా…ఏజెన్సీల వద్ద క్యూలు తగ్గడం లేదు. ఈ-కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధి చేకూరదేమోననే ఆందోళనతో గ్యాస్ ఏజెన్సీలకు తరలుతున్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త పథకాలకు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనమే.. వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలకు వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుల విచారణకే సమయం కేటాయించాల్సి వస్తున్నదని, ఒక్కో రోజు నగరాల్లో 4వేల దరఖాస్తులు రాగా, మండలాల్లో సైతం ఇదే మాదిరి రద్దీ ఉంటున్నది. మీసేవా కేంద్రాలు తెరవక ముందే జనమంతా బారులు తీరుతున్నారు. అవసరమైతే అక్కడికే భోజనం తెచ్చుకొని మరి పని ముగిసే వరకు ఉంటుండడం గమనార్హం.