Accident | ఎల్లారెడ్డి రూరల్ : వేగంగా బైక్పై దూసుకెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం మీసన్పల్లి శివారులో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామానికి చెందిన చాకలి ఏగొండ (18) అనే యువకుడు ఎల్లారెడ్డి నుండి భిక్కనూర్ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. మీసన్పల్లి గ్రామ శివారు వద్దకు చేరుకోగానే, అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు తన బైక్ను ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు.. మృతుని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి రెండు నెలల క్రితం మరణించడం, వెంటనే యువకుడైన ఏగొండ చిన్నతనంలోనే ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.