మెండోరా, డిసెంబర్ 16 : యాసంగి సాగుకోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేపట్టనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలకు ప్రాజెక్టు అధికారులు రంగం సిద్ధం చేశారు.ప్రతి ఎకరాకు నీరు అందేవిధంగా 60 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1088.60 అడుగుల (78.342 టీఎంసీలు) వద్ద నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున9 టీఎంసీల నీటి నిల్వ ఎక్కువగా ఉంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువ ఎల్ఎండీ (లోయర్ మానేర్ డ్యామ్) వరకు వారబందీ ప్రకారం (ఆన్‌అండ్‌ఆఫ్) నీటి విడుదలను చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ..నీటి విడుదల ఖరారు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మీ, సరస్వతీ, కాకతీయ కాలువల ద్వారా
లక్ష్మీ, సరస్వతీ, కాకతీయ కాలువ ద్వారా దిగువన ఉన్న ఎల్ఎండీ ప్రాజెక్టు వరకు 7.56లక్షల ఎకరాల సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏడు రోజుల పాటు కాకతీయ కాలువకు నీటి విడుదల చేస్తూ మరో ఏడు రోజుల పాటు కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేస్తారు. లక్ష్మీ, సరస్వతీ కాలువల ద్వారా నిరంతరం నీటి విడుదల కొనసాగనున్నది. లక్ష్మీ, సరస్వతీ, కాకతీయ కాలువల ఆయకట్టుతోపాటు గుత్ప, అలీసాగర్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలకు నీటి విడుదల చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
రైతులకు సమాచారం ఇస్తున్నాం..;శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజినీర్
కాకతీయ కాలువ (లోయర్, మానేర్ డ్యామ్‌పైన) పరిధిలోని ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై సమాచారం అందిస్తున్నామని ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మొదటి 7 రోజులు డిస్ట్రిబ్యూటరీ 53 జోన్ 1 ఆయకట్టు పరిధి వరకు తర్వాత 8 రోజులు డి 53 కింది జోన్ 2 ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్‌లో వారబందీ ప్రకారం సాగునీటిని అందిస్తామన్నారు. 60 టీఎంసీలను మాత్రమే ఆయకట్టుకు అందిస్తామన్నారు. ఈ నీటిని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి సీజన్‌కు ఈనెల 18 నుంచి నీటిని విడుదల చేస్తాం. కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ ఆయకట్టుదారులు, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఎకరాకు నీరందేలా 60 టీఎంసీల నీటిని విడుదల చేస్తాం.
– చక్రపాణి, ప్రాజెక్టు ఏఈఈ