వినాయక్‌నగర్, డిసెంబర్ 24: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న శిశు గృహంలో మూడు మాసాల పసికందు మంగళవారం మృతి చెందింది. ఓ మితిస్థిమితం లేని యువతి సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిపోయింది. గమనించిన దవాఖాన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, సిబ్బం ది సమక్షంలో పాపకు ‘స్వతంత్ర’ అని నామకరణం చేశారు. తక్కువ బరువుతో జన్మించడంతో పసికందును శిశు గృహంలో ఉంచారు. మూడు నెలలుగా అక్కడే ఉంటున్న పాప శరీరమంతా ఇన్ఫెక్షన్ కావడంతో మంగళవారం మృతి చెందగా.. శిశు గృహం బాధ్యులు మూడో టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్న శిశుగృహంలో చిన్నారి ప్రాణాలు పోయే వరకు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిర్వాహకులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పసిపాప ఆలన పాలనతో పాటు ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకపోవడంతో అనారోగ్యానికి గురై పాప మృతి చెందిందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.