కామారెడ్డి, డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజల భిక్షతోనే తనను ఎమ్మెల్యే పదవి వరించిందని, తన విజయం కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో బీజేపీ గెలుపు కోసం ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి బద్దం మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు