లింగంపేట్ : ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం లింగంపేట మండల కేంద్రంలో పట్టభద్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గత సంవత్సరం అధికారంలోకి వచ్చిందన్నారు . ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. పట్టభద్రుల తరఫున శాసనమండలిలో (Legislative Council) ప్రశ్నించడానికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు .
శాసనమండలిలో సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి అంజిరెడ్డి అని వివరించారు . సమావేశంలో బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం రాజు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ , జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణతార , లింగంపేట్ మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్, నాయకులు రామ్‌రెడ్డి, బాపురెడ్డి, దత్తురాము, పట్టభద్రులు, నాయకులు పాల్గొన్నారు .
మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య
కామారెడ్డిలో నిర్వహించిన ప్రచారంలో , బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు. మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య అని విమర్శించారు . ఎన్నికల ముందు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ పార్టీ అనేక హామిలిచ్చిందని, హామీలను నెరవేర్చలేక , అభ్యర్థిని నిలబెడితే ఎక్కడ ప్రశ్నిస్తారోనని భయంతో అభ్యర్థిని పెట్టలేదని ఆరోపించారు.
ఉపాధ్యాయులకు 5 డీఏలు క్లియర్ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఒక్కటి కూడా చేయలేదని పేర్కొన్నారు. ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ మోడల్ అని అభివర్ణించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు 2500 పింఛన్, పింఛన్ల పెంపు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు 4 వేల భృతి, అమ్మాయిలకు స్కూటీలు, పై చదువులకు రుణాలు ఇస్తామని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.