Nizamabad | వినాయక నగర్, డిసెంబర్ 13 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీల పేరుతో అడ్డుకొని అతని ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు కాజేసిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని మూడటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు గంజాయి కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నమ్మించారు. ఆ వ్యక్తి వద్ద నుండి మెడలోని బంగారి గొలుసు తో పాటు చేతి వేలుకు ఉన్న బంగారు ఉంగరాన్ని దోచుకు వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నగరంలోని నాందేవ్ వాడి ప్రాంతానికి చెందిన రాములు అనే వ్యక్తి తన యాక్టివా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిని అడ్డుకున్నారు.
గంజాయి కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ఆయనను నమ్మించి యాక్టివా డిక్కీని తెరిపించారు. అందులో తనిఖీ నిర్వహించినట్లుగా నటించిన వారు ఏమీ లేకపోవడంతో ఎలాగైనా ఆయన వద్ద ఉన్న బంగారు గొలుసు ఉంగరాన్ని కాల్ చేయాలని ప్లాన్ వేశారు. చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోయారని ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసి డిక్కీలో పెట్టుకోమని రాములును సూచించారు. వారి మాటలు నమ్మిన ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, వేలికి ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని తీసి డిక్కీలో పెట్టేందుకు ప్రయత్నం చేశాడు.
ఇంతలో తామే డీక్కీలో భద్రంగా పెడతామని అతని నమ్మించి బంగారు గొలుసుతో పాటు ఉంగరాన్ని కాజేసిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. వెంటనే తీరుకొని చూడగా డిక్కీలో తన గొలుసు ఉంగరం లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సంబంధిత మూడోటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా మూడోటౌన్ ఎస్సై హరిబాబు వెల్లడించారు.