లింగంపేట(తాడ్వాయి), డిసెంబర్ 18: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తాగి బండి నడుపుతున్న అతడిని పోలీసులు ఠాణాకు తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ చెట్టెక్కాడు. ఈ క్రమంలో పైనుంచి కిందపడడంతో గాయపడిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా, మండల కేంద్రానికి చెందిన కీసరి గంగాధర్ తన వాహనంపై అటువైపు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా, మద్యం సేవించినట్లు తేలింది. దీంతో వాహనంతో పాటు అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఠాణా ఆవరణలో ఉన్న చెట్టు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు ముందుజాగ్రత్తగా చెట్టు కింద వల ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించారు. వారు వచ్చి ఎంత నచ్చజెప్పినా వినని గంగాధర్ చిటారు కొమ్మలపైకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత ప్రయత్నించినా దిగకపోగా, తన వద్ద ఉన్న మద్యాన్ని తాగుతూ కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి చెట్టు కింద ఏర్పాటు చేసిన వలలో పడ్డాడు. అయినప్పటికీ అతడికి గాయాలు కావడంతో పోలీసులు కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.