Odela | ఓదెల, ఏప్రిల్ 26: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓదెల మండల కేంద్రంలో దాదాపు గత 15 సంవత్సరాల నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నిర్వహించారని, ప్రస్తుతం ఆ కేంద్రాన్ని పోత్కపల్లిలో ఏర్పాటు చేయడానికి నిరసించారు.
రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన వెలిబుచ్చారు. ఓదెల రైతుల సౌకర్యార్థం వెంటనే ఓదెలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోడకుంట నరేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలోజు రమేష్, నాయకులు చింతం వెంకటస్వామి, బోడగుంట మహేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.