నాగిరెడ్డిపేట, ఆగస్టు 3: ఒకప్పుడు అరుదైన పండ్ల తోటలతోపాటు మొక్కలకు గొప్ప గుర్తింపు పొందిన మండలంలోని మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అధ్వానంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పర్యవేక్షణ లోపం, నిధుల లేమితో నేడు క్షేత్రం గేటు కూడా తెరుచుకోని దుస్థితి నెలకొన్నది. మాల్తుమ్మెద విత్తన క్షేత్రం 1978లో ప్రధాన రహదారి పక్కన 61 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అరుదైన పండ్ల తోటలతోపాటు అంటు మొక్కలకు ఉమ్మడి ఏపీలోనే గుర్తింపు పొందింది. కాలానుగుణంగా సమైక్యపాలనలో నిధులు లేక ఆదరణ కోల్పోయింది.
2014లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కోట్ల రూపాయల నిధులతో ఉద్యానవన క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చింది. రాష్ట్రంలోని రైతులకు ఇక్కడ ఉద్యాన పంటలపై శిక్షణ సైతం ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నిధులు మంజూరుకాక ఆలనాపాలన కరువైంది. గతేడాది సైతం క్షేత్రంలోని గడ్డిని కూడా తొలగించకపోవడంతో సగానికిపైగా అగ్ని ప్రమాదానికి గురైంది.
ఈ ఏడాది నిధులు లేవంటూ అధికారులు క్షేత్రానికి తాళం వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రధాన దారిలో కూడా పిచ్చిమొక్కలు పెరిగి క్షేత్రం లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. క్షేత్రంలో 61 ఎకరాల్లో విలువైన మామి డి, జామ, యాపిల్‌బేర్, ఉసిరి తోటలు, వివిధ రకాలు చెట్లు ఉన్నాయి. వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యం వహించడంతో క్షేత్రం కళావిహీనంగా మారింది.
ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన క్షేత్రం.. నేడు ఆదరణ కోల్పోవడంతో మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఉద్యాన వనక్షేత్రం ఇన్చార్జి హెచ్‌వో సుమన్‌ను వివరణ అడుగగా..క్షేత్రానికి నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టడం లేదన్నారు. నిధులు మంజూరు కాగానే అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. క్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.