ఎన్నో ఆశలతో దుక్కి దున్ని నారు పోసి యాసంగి పంట వేశారు. పంట ఏపుగా పెరిగింది. దీంతో రైతులు మురిసిపోయారు. రెండు, మూడు తడులు అందిస్తే పంట చేతికందుతుందని సంతోషపడ్డారు. ఆ సంతోషం మూన్నాళ్లు కూడా మిగలలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోయి ఉన్న బోరు నుంచి నీటి చుక్క కూడా రాలేదు. దీంతో వేసిన పంట ఎండిపోయింది. రైతుకు గోడును మిగిల్చింది.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా పంచాయతీ పరిధికి చెందిన కడావత్ పరశురాం అనే రైతు తనకున్న మూడున్నర ఎకరాల్లో వరి పంటను వేశాడు. వరి గింజ కట్టే దశలో నీటి తడులు అందక బోర్లలో పూర్తిగా నీరు ఇంకిపోయి ఎండిపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. చివరికి ఇతర రైతుల ఇంటి వద్ద ఉన్న బోరునీటిని అడిగి తీసుకొని అర ఎకరం నుంచి ఎకరం వరకు కాపాడుకునే ప్రయత్నాలు చేశాడు. మిగతా రెండున్నర ఎకరాల పంట మొత్తం ఎండిపోయింది. చేసిందేమీ లేక గుండెలు బాదుకుంటున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
కోటగిరి, మార్చి 5: ‘ఎండుతున్న పైరు.. రైతుల కన్నీరు’ అని నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం వచ్చిన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు సాగు నీరు అందక, ఉన్న బోరు నీరు సరిపోక ఎండిపోతున్న వరి పంటలను మంగళవారం ఉదయం బాధిత రైతులకు కలిసి పరిశీలించారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరు నీరు లేక పక్క రైతు బోరు నుంచి తాత్కాలికంగా నీటిని తీసుకొని ఎండిపోతున్న వరికి పెడుతున్నారని కోటగిరి మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాలువ ద్వారా రెండు దఫాలుగా చివరివరకు సాగు నీరు అందక పంట ఎండిందని, ప్రస్తుతం తడి పెట్టడంతో కొంత సమస్య పరిష్కారమైందన్నారు.
నాకున్న మూడున్నర ఎకరాల్లో వరి వేశా. పంట మొత్తం మంచిగానే పండింది. చాలా ఆనందం అనిపించింది. గొలక వేసింది. రెండు, మూడు తడులు అందిస్తే పంట చేతికందేది. రిగ్గు మోటార్లలో చుక్క నీరు కూడా రాకపోవడంతో ఉన్న పొలం ఎండిపోయింది. గొలకేసిన ఆనందం మిగలకుండా మాకు గోడును మిగిల్చింది. మా తండా వాళ్లను కాళ్లు మొక్కి నీళ్లు అడిగితే ఒక రెండు మడులకు నీరిచ్చారు. సుమారు అర ఎకరంలోపు పంట బతికింది. మిగతా పంట మొత్తం ఎండుకపోయింది. ప్రభుత్వమే మా గోస చూసి ఆదుకోవాలి.
నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. పానీ అందుతుందో లేదోనని యాసంగిలో రెండు ఎకరాల అరి పంట ఏసినం. ఆ పంటైనా చేతికందుతుందేమోననుకుంటే ఏసిన కాడికి ఉన్నదంతా ఎండిపోయింది. పంటను చూస్తే ఏడ్పువస్తున్నది. ఒక్క రూపాయి కూడా రాకుండా పోయింది. ఇవ్వారకు ఎవరూ రాలే. ఇప్పుడైనా గవర్నమెంటోళ్లు మమ్మల్ని ఆదుకోవాలని మొక్కుతున్నా.