నిజాంసాగర్/బిచ్కుంద, నవంబర్ 21: ఏసీబీ వలకు ఓ అవినీతి వ్యవసాయ శాఖ చేప చిక్కింది. ఫెర్టిలైజర్ షాపు యజమాని నుంచి లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన గుండెకల్లూర్ గంగాధర్.. బిచ్కుంద మండల కేంద్రంలో అన్నదాత ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతను దుకాణం నడిపించుకోవడానికి ఏటా వ్యవసాయశాఖ అధికారి పోచయ్యకు రూ.18వేల లంచం ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో అధికారికి వారం క్రితం రూ.8వేలు ముట్టజెప్పాడు. మిగిలిన రూ. పది వేలు ఇవ్వాలంటూ వ్యాపారికి రోజూ ఫోన్ చేసి ఏవో వేధించసాగాడు. దీంతో గత్యంతరం లేక వ్యాపారి గంగాధర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు గంగాధర్.. మంగళవారం సాయంత్రం వ్యవసాయశాఖ అధికారి పోచయ్యకు ఫోన్ చేసి రూ. పది వేలు తెచ్చానని, ఎక్కడ కలవాని అడిగాడు. ఆయన బిచ్కుందలోని సిద్దిరామేశ్వర జనరల్ స్టోర్లో డబ్బులు ఇవ్వాలని సూచించారు. దీంతో అతడు షాపులో డబ్బులను అప్పజెప్పాడు. అంతలోనే ఏసీబీ అధికారులు దాడి చేసి సిద్దిరామేశ్వర దుకాణం యజమానిని అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ అధికారి పోచయ్య చెప్పడంతోనే తాను డబ్బులు తీసుకున్నానని వెల్లడించాడు. ఈ మేరకు అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఏవో కార్యాలయంతోపాటు పోచయ్య నివాసంలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేశామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.