నాగిరెడ్డిపేట, జూలై 30 : ప్రియుడి మోజులో పడిన ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు కుట్ర పన్నింది. సుపారీ ఇచ్చి మరీ అంతమొందించాలని చూసింది. ప్రియుడితో కలిసి చేసిన హత్యాయత్నం విఫలం కావడంతో ఆమె ప్లేట్ ఫిరాయించింది. పోలీసులను తప్పుదోవ పట్టించాలని కూడా చూసింది. కానీ అన్ని ప్రయత్నాలు ఎదురుతన్నడంతో ఆ ఇల్లాలి కుట్ర బయటపడింది. కేసు వివరాలను సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై అగస్త్య భాస్కర్గౌడ్తో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం విలేకరులకు వెల్లడించారు.
నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూర్‌కు చెందిన పల్లె రవి భార్య సంపూర్ణకు, అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జాన్సన్‌కు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న రవిని అంతమొందించాలని సంపూర్ణ నిర్ణయించుకుంది. తన భర్తను చంపేస్తే రూ.లక్ష సుపారీ ఇస్తానని, ఇందుకోసం ఎవరైనా ఉంటే చూడాలని ఆమె ప్రియుడితో చెప్పి, భర్త ఫొటోను అప్పగించింది. అయితే, రవి తనకు డబ్బులకు ఇబ్బందిగా ఉన్నదని, అప్పుగా ఇప్పించాలని జాన్సన్‌ను కలిశాడు.
తన వద్ద లేవని, కానీ, తాండూర్‌లో తనకు తెలిసిన వారు అప్పు ఇస్తారని చెప్పి ఈ నెల 23న రవిని, గ్రామానికి చెందిన నవీన్‌ను వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడ చాకలి రాజు, మరో బాలుడిని కలిసి అప్పు విషయమై మాట్లాడారు. ఈ క్రమంలో వారంతా కలిసి ఎల్లారెడ్డి మండలం పెద్దారెడ్డి డంప్ యార్డుకు వచ్చి అర్ధరాత్రి దాకా మద్యం సేవించారు.
మద్యం మత్తులోకి జారుకున్న రవిపై జాన్సన్, చాకలి రాజు దాడి చేశారు. సుత్తితో తలపై బాది హత్య చేసేందుకు యత్నించగా, కింద పడిన రవి వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అయినా ఇద్దరు వెంబడించగా సమీపంలో ఉన్న మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. అక్కడే ఉన్న మనోహర్‌రెడ్డి రవి పరిస్థితిని గమనించి, 108కు కాల్ చేశారు. 108 సిబ్బంది రవిని నిజామాబాద్ దవాఖానకు తరలించారు.
ప్రియుడిపైనే ఫిర్యాదు..
రవిపై హత్యా ప్రయత్నం విఫలం కావడంతో ప్లేట్ ఫిరాయించిన భార్య సంపూర్ణ.. పోలీసులను పక్కదారి పట్టించేందుకు యత్నించింది. ఈ నెల 24న ఫి ర్యాదు చేసిన ఆమె.. జాన్సన్, నవీన్‌పై అనుమానం ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తాగిన మైకంలో దాడి జరిగినట్లు భావించిన పో లీసులు జాన్సన్, నవీన్, చాకలి రాజుతో పాటు బాలుడిపై కేసు నమోదు చేశారు. అయితే, వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టగా, అసలు కథ బయట పడింది.
భర్తను అడ్డు తొలగించుకోవడానికి సంపూర్ణ కుట్ర పన్నిందని తేలింది. దీంతో ఆమెతో పాటు ప్రియుడు జాన్సన్, నవీన్, చాకలి రాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తె, 2 బైకులు, రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సై అగస్త్య భార్గవ్‌గౌడ్, హెడ్ కానిస్టేబుల్ మనోహర్, కానిస్టేబుల్స్ సందీప్, గంగారాం, ఉమెన్ పీసీ అన్వరీలను ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.