కామారెడ్డి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (Inter exams) పకడ్బందీగా, మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ( Collector Sangwan ) అన్నారు. బుధవారం నుంచి ప్రారంభమయిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్ లలో మొదటి రోజు మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగాయి.
పరీక్షలో 9,230 మంది విద్యార్థులకు గాను 8863 మంది విద్యార్థులు హాజరయ్యారని, 347 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఇందులో జనరల్ గ్రూప్‌లో 7,786 మందికి గాను 7, 555 మంది హాజరయ్యారని వివరించారు. 231 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ గ్రూప్ లో 1,444 మంది విద్యార్థులకు గాను 1,308 మంది హాజరు కాగా, 116 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
కామారెడ్డి ( Kamareddy ) పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలకు పంపించే సమయంలో ప్రతీ విద్యార్థిని తప్పనిసరిగా పరిశీలించి పంపించాలని తెలిపారు. గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కూడా అనుమతించ కూడదని తెలిపారు. అనధికార వ్యక్తులను లోనికి పంపించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి షేక్ సలాం, తదితరులు పాల్గొన్నారు.