కామారెడ్డి, జూన్ 6 : జిల్లాలో దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న 79 మంది హోంగార్డులను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో తమకు కేటాయించిన పోలీసు స్టేషన్లో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలో మూడేండ్ల కన్నా ఎక్కువ కాలం ఒకే పోలీసుస్టేషన్ లేదా వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులను బదిలీ చేసినట్లు తెలిపారు.
సంబంధిత హోంగార్డుల విల్లింగ్ స్టేషన్లు, వారి సీనియార్టీ, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, ఒక్కరు చేసిన తప్పు మొత్తం శాఖపై ప్రభావం చూపుతుందన్నారు. హోంగార్డులు జాగ్రత్తగా, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కొత్త నియామక ప్రాంతాల్లో హోంగార్డులు మరింత నిబద్ధతతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.