కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/నిజామాబాద్ క్రైం, ఆగస్టు 16 : దరఖాస్తుల గడువు దగ్గరపడడంతో మద్యం టెండర్లు జోరందుకున్నాయి. ఈ నెల 18తో గడువు ముగియనుండడంతో బుధవారం ఉభయ జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 746, కామారెడ్డి జిల్లాలో 943 టెండర్లు దాఖలయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం షాపుల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వ్యాపారుల నుంచి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బుధవారం టెండర్లు దాఖలు చేసేందుకు వ్యాపారులు భారీగా తరలిరావడంతో సాయంత్రం 7.30 గంటల వరకు అదనంగా రెండు గంటలపాటు దరఖాస్తులను స్వీకరించగా, 197 అప్లికేషన్లు వచ్చాయి. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 105, బోధన్ 19, ఆర్మూర్ 40, భీమ్‌గల్ 13, మోర్తాడ్ పరిధిలో 20 టెండర్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులుగా మొత్తం 746 దరఖాస్తులు వచ్చాయి. మద్యం టెండర్లకు దరఖాస్తు గడువు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచే దరఖాస్తులను స్వీకరిస్తామని నిజామాబాద్ ఈఎస్ తెలిపారు.
కామారెడ్డిలో ఒక్కరోజే 202..
కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, వ్యాపారుల నుంచి భారీ స్పందన వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి 943 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజే 202 దరఖాస్తులు రావడం గమనార్హం. మరో రెండు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైస్‌మిల్లర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు వైన్స్ షాపుల కోసం ఆసక్తి చూపుతున్నారు. 20 శాతం కమీషన్‌తోపాటు రోజువారీగా లిక్విడ్ క్యాష్ అందే ఈ రంగంలో ప్రవేశానికి వ్యాపారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. రానున్న రెండేండ్లలో వరుస ఎన్నికలు, మేడారం జాతర ఉండడంతో మద్యం షాపుల కోసం వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఎక్సైజ్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తే… కామారెడ్డి పరిధిలో ఇప్పటివరకు 314, దోమకొండ 204, ఎల్లారెడ్డి 130, బాన్సువాడ143, బిచ్కుంద పరిధిలో 152 దరఖాస్తులు వచ్చాయి.