రుద్రూర్, ఆగస్టు 30: సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్‌నగర్‌లో రూ.2.50కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. హెల్త్ సెంటర్, మసీదు ప్రహరీ, వాటర్ ట్యాంకు, రూ.50లక్షల నిధులతో యోగా హాల్, ఆలయ నిర్మాణ పనులు తదితర వాటికి శ్రీకారం చుట్టారు. అనంతరం అక్బర్‌నగర్ సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. ఆశ్రమంలో అందజేసే వైద్యం సేవా దృక్పథంతో కూడిందని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సుమారు రూ.500 నుంచి రూ.600 కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించామని తెలిపారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఒకే జూనియర్ కళాశాల ఉండేదని, ఇప్పుడు 31 కళాశాలలు నిర్మించామని అన్నారు. సీఎం సహకారంతో నియోజకవర్గంలో 11వేల డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించామన్నారు. తక్కువ ఖర్చుతో వైద్యం చేసే ఆశ్రమానికి అనేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. ప్రకృతి ఆశ్రమం అక్బర్‌నగర్‌లో ఉండడం ప్రజల అదృష్టమని అన్నారు. ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్న మంతెన సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమంలో మిగిలిన పనులను పూర్తిచేసేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.
ముస్లిం మహిళలకు డబుల్బెడ్రూం ఇండ్లను అందజేసి ఇచ్చిన మాటను సభాపతి పోచారం నిలబెట్టుకున్నారు. బోధన్ పట్టణానికి చెందిన ఫాతిమా భగవద్గీతపై ఇష్టంతో శ్లోకాలను ఉర్దూలోకి అనువాదం చేసింది. ఫాతిమాకు సొంత ఇల్లు లేకపోవడంతో గతేడాది నవంబర్‌లో డబుల్బెడ్రూం ఇంటిని ఇస్తామని మాటిచ్చారు. వర్ని మండలం రజక కాలనీకి చెందిన ఫౌజియా పర్వీన్ ఈ ఏడాది జనవరిలో ప్రసవం తర్వాత అనారోగ్యంతో మరణించింది. ఫౌజియా పర్వీన్ భర్త ఖాసీంకు రేకుల ఇల్లు ఉండడంతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్రూర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల తాళాలను ఫాతిమా, ఫౌజియా పర్వీన్ తల్లి ఆసియా బేగానికి బుధవారం ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని తమ కుటుంబాలకు అండగా నిలబడిన సభాపతికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఫాతిమా, ఆసియాబేగం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, సర్పంచ్ గంగామణీప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సుబ్బారావు, ప్రకృతి ఆశ్రమం నిర్వాహకులు మంతెన సత్యనారాయణ, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో బాలగంగాధర్, వైస్‌ఎంపీపీ సాయిలు, కోఆప్షన్ మెంబర్ మస్తాన్, సీనియర్ నాయకులు పత్తి రాము, రామాగౌడ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.