వేల్పూర్ , జూలై 6: రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో నూకలు రావడంతో వాటిని డీలర్లు పంపిణీ చేస్తున్నారు. మండలంలోని అన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో నూకలు రావడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీలో క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నా, పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. జూలైలో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో 60శాతం నూకలు ఉండడంతో లబ్ధిదారులు.. కొన్నిచోట్ల రేషన్ డీలర్లను నిలదీస్తున్నారు.
దీంతో తాము చేసేదేమీలేదని, తమకు సరఫరా చేస్తున్న బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. పేదలకు నాణ్యతలేని బియ్యం పంపిణీ చేస్తున్నా, క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. నూకలు రావడంతో వాటిని తినలేక, బయట దుకాణాల్లో సన్న బియ్యం కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.