అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులర్పించడంతో పాటు వినతిపత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా గులాబీ శ్రేణులు మహాత్ముడికి వినతిపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కండ్లు తెరిపించి ఇచ్చిన హామీలను అమలు చేసేలా చూడాలని విన్నవించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీచౌక్‌లోని మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అలాగే, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బిచ్కుందలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్, ఆర్మూర్ డివిజన్లలోనూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
– ఖలీల్‌వాడి/కంఠేశ్వర్/బిచ్కుంద, జనవరి 30
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా విమర్శించారు. డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వంద రోజుల్లో అమలు చేస్తామని ఊదరగొట్టిందన్నారు. కానీ 420 రోజులు గడుస్తున్నా హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్‌లోని గాంధీచౌక్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో 6.47 లక్షల కొత్త కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు గోబెల్ సిగ్గుపడేలా అబద్ధాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణ యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్‌గాంధీ ముఖం చాటేశాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందులో నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని బిగాల మండిపడ్డారు. రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తే కొందరికి మాత్రమే మాఫీ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా లాక్డౌన్, నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులున్నప్పటికీ కేసీఆర్ రూ.28,725 కోట్ల రుణమాఫీ చేశాడని తెలిపారు.
420 రోజులు గడుస్తున్నా రేవంత్ సర్కారు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో 412 మంది రైతుల ఆత్మహత్యలు, 100 మందికి పైగా ఆటోడ్రైవర్లు బలవన్మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. గురుకులాల్లో కల్తీ ఆహారంతో 55 మందికి పైగా విద్యార్థుల దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని, వారు కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ మేయర్ దండు నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నేతలు సత్యప్రకాశ్, దండు శేఖర్, నవీద్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా అబద్ధాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ధ్వజమెత్తారు. బిచ్కుందలో మహాత్ముడి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం వినతిపత్రం అందజేశారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించామన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. కానీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 420 రోజులు పూర్తయినా ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో సీఎం రేవంత్ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా అటెన్షన్ డైవర్షన్‌తో కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలు ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అబద్ధపు మాటలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ.. 2021లో కేసీఆర్ ప్రభుత్వంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల కార్యక్రమంలో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పాల్గొన్న విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాడుతుందన్నారు. నాయకులు నాల్చర్ రాజు, మల్లికార్జున్, నాల్చర్ బాలాజీ, యాదారావు, హన్మాండ్లు, ముఖిద్ పాల్గొన్నారు.
చందూర్‌లో అల్లమాప్రభు జాతర ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన 14 ఏండ్ల పల్లవి సత్తా చాటింది. బలమైన ప్రత్యర్థులను చిత్తు చేసి విజేతగా నిలిచింది. మల్ల యుద్ధంలో స్థానికంగా ఉన్న మహామహులను ఓడించిన బాలిక ‘పట్టు’దలను చూసి అక్కడున్న వారు అబ్బురపడ్డారు.
– చందూర్, జనవరి 30