ఖలీల్వాడి, జూన్ 21 : కారుమబ్బులు.. వాన చిణుకులు.. చల్లని గాలులతో ఆహ్లాదకర వాతావరణం ఉండాల్సిన వానాకాలంలో పూర్తిగా ప్రతికూల పరిస్థితి కనిపిస్తున్నది. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. భానుడు సెగలు కక్కుతున్నాడు. సూర్య ప్రతాపానికి ఇంకా ఎండాకాలంలోనే ఉన్నామనిపిస్తున్నది. వేడికి ఇంట్లో ఉండలేం.. బయటకు వెళ్లలేమన్నట్లుగా పరిస్థితి తయారైంది. తొలకరి వర్షాలు పలుకరించాల్సిన తరుణంలో ఎండలు దంచి కొడుతున్నాయి. జూన్ మూడో వారం దాటినా.. వానలు మాత్రం ముఖం చాటేశాయి. దీనికంతటికీ కారణం ఎల్నినో ప్రభావమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి రోహిణి కార్తెలో దంచి కొట్టే ఎండలు మృగశిర కార్తెలో తగ్గుముఖం పడుతాయి. జూన్ రెండో వారం ఆరంభంలో ప్రారంభమయ్యే మృగశిర కార్తెలోనే తొలకరి జల్లులు కురుస్తాయి. అయితే, ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాల జాడ కరువైంది. ఒకటి, రెండు జల్లులు మాత్రమే కురిశాయి. ఇక ఆరుద్ర కార్తె ప్రారంభమవుతున్న తరుణంలోనూ ఎండలు తగ్గకపోవడం, వానలు ముఖం చాటేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దంచి కొడుతున్న ఎండలకు తోడు వేడి గాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం 6 గంటలకే భానుడు ప్రతాపం చూపుతుండగా, రాత్రి 7 గంటల దాకా ఎండ వేడిమి తగ్గడం లేదు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి జూన్ ఆరంభం నుంచే వాతావరణం చల్లబడుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలు కురుస్తాయి. సూర్య ప్రతాపం తగ్గి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాల్సిన తరుణంలో.. ఎల్నినో ప్రభావం ఇంకా వానాకాలం కాస్త ఎండాకాలాన్ని తలపిస్తున్నది. జూన్ మూడో వారంలోనూ పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా, రాత్రివేళ 30 డిగ్రీల దాకా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మండుటెండలకు తోడు వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావం మనపై తీవ్రంగానే పడింది.

తేదీ గరిష్ఠం కనిష్ఠం
15 39.5 28.3
16 39.4 28.3
17 40.4 28.3
18 41.5 29.3
19 39.5 29.8
20 41.3 29.7
21 41.9 26.8
ఎండల తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చాలా అప్రమత్తం గా ఉండాలి. ప్రధానంగా పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా నీరు సేవించాలి. ఎండదెబ్బ తగిలితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి.
– డాక్టర్ రాజశ్రీ, నిజామాబాద్ డీఎంహెచ్వో