తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
కేంద్ర ప్రభుత్వ దన్నుతో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై పెనుకుట్రకు తెరలేపారని, రాష్ట్ర నీటి హక్కులకు మరణశాసనం రాసేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
- గోదావరి-కావేరి లింకు ముసుగులో తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం
- గురువుకు రేవంత్ దాసోహం.. దన్నుగా కేంద్రం
- ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశ ఎజెండాగా జీసీ లింకు
- ఆ ముసుగులో బనకచర్ల ప్రాజెక్టుకు ప్రణాళికలు
- కృష్ణానదీ జలాల్లోనూ రాష్ర్టానికి తీరని అన్యాయం
- కాంగ్రెస్ నిర్వాకంతో మన ప్రాజెక్టులకు ముప్పు
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్ నిప్పులు
24 గంటల పాటు మోటర్లు ఆన్‌చేసి నీళ్లెత్తలేదు. పంప్‌హౌస్‌ల వద్దకు తీసుకెళ్తే సర్కార్ ఫెయిల్యూర్‌ను చూపిస్తా? ఎన్ని గంటలు నడిపినవో? ఎన్ని నీళ్లెత్తినవో తెలుస్తుంది. కల్వకుర్తిలో 35 టీఎంసీలు ఎత్తే అవకాశముంటే 13 టీఎంసీలే ఎత్తి మిగిలినవి ఏపీకి ధారాదత్తం చేసినవు. రుజువు చేయడానికి రెడీగా ఉన్నా.. పోదాం పా..
-హరీశ్ సవాల్
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి లింకు ముసుగులో బనకచర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వివరించారు. ఇటు గోదావరి, అటు కృష్ణాలో తెలంగాణ నీటి వాటాలకు ఎసరు పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు తీరని ముప్పు వాటిల్లుతున్నా ఇక్కడి రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం మొద్దునిద్రలో ఉన్నదని నిప్పులు చెరిగారు.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి శనివారం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ఢిల్లీలో నవంబర్ 3న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించనున్నదని, ఎజెండాను అన్ని రాష్ర్టాలకు పంపిందని వివరించారు. అందులో గోదావరి-కావేరి లింకును చేర్చారని, ఆ ముసుగులో తెలంగాణపై పెద్ద కుట్రకు తెరతీశారని వివరించారు.
నాడు కుక్కిన పేనులా పడుండి.. నేడు కుట్రలు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కుకిన పేనులా పడున్న తెలంగాణ ద్రోహులంతా ఇవ్వాళ మళ్లీ నిద్రలేచారని, కుట్రలకు పాల్పడుతున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. జీసీ లింకును ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్ నుంచే చేపట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు పట్టుబట్టామని, ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా అన్ని రాష్ర్టాలతో ఎంవోయూకు సైతం ఎన్‌డబ్ల్యూడీఏ సిద్ధపడిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కొత్తకుట్రలు ప్రారంభమయ్యాయని, గత ప్రతిపాదనలను కేంద్రం పక్కకు నెడుతున్నదని ధ్వజమెత్తారు. అక్టోబర్ 7న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు చంద్రబాబు లేఖ రాశారని, గోదావరి-కావేరి లింకును పోలవరం నుంచి చేపట్టాలని, ఎజెండాలో చేర్చాలని కోరారని, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఎన్‌డబ్ల్యూడీఏ ఎజెండాలో ఆ అంశాన్ని పొందుపరిచారని ఆక్షేపించారు.
జీసీ లింకు ముసుగులో పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి, గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రాకు తరలించేందుకు విష కూటమిలా తయారయ్యారని, కోవర్టు రేవంతు తెలంగాణ నీటి హకులను నిండా ముంచుతున్నాడని మండిపడ్డారు. తొలుత గోదావరిలో 200 టీఎంసీలు తీసుకుపోయేందుకు పోలవరం-బనకచర్లను, ఆపై నల్లమలసాగర్‌ను తెరమీదికి తెచ్చారని, బీఆర్ఎస్ హెచ్చరికలతో ఆ ప్రాతిపదనలపై వెనక్కి తగ్గారని వివరించారు. ఇప్పుడు రూటు మార్చి కేంద్రం అండతో గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట బనకచర్లకు మార్గం సుగమం చేసుకునేందుకు మూడో ప్రతిపాదనకు సిద్ధమయ్యారని వివరించారు.
పోలవరం నుంచి బొల్లపల్లి, నాగార్జునసాగర్, సోమశిల ద్వారా కావేరికి నీళ్లు తరలించే ప్రణాళికలు సిద్ధం చేశారని, ఇది మొత్తంగా తెలంగాణ నదీజలాలను కబళించే కుట్ర అని వివరించారు. పోలవరం నుంచి కావేరికి నేరుగా కలిపే అనుసంధానంలో తెలంగాణను లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు నీళ్లున్నా.. నీటి హకులున్నా రేవంత్ ప్రభుత్వం వినియోగించలేదని, ఇప్పుడు చంద్రబాబు ఏకంగా నీటి హకులే లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రానికి బాబు లేఖల మీద లేఖలు
గోదావరి జలాలను తరలించుకుపోయే లింకు విషయంలో చంద్రబాబు లేఖల మీద లేఖలు రాస్తున్నారని, ఢిల్లీలో మీటింగులకు అటెండవుతున్నారని, రేవంత్‌రెడ్డి మాత్రం రాతి బొమ్మలా నిలబడి చూస్తున్నాడని దుయ్యబట్టారు. ‘గోదావరి-కావేరి లింకులో సమ్మక సాగర్ నుంచి నాగార్జునసాగర్ మీదుగా జలాలను తీసుకువెళ్లాలి. తెలంగాణకు సంబంధించి గోదావరిలో 968 టీఎంసీల నీటి హక్కులకు రక్షణ కల్పించాలి. ఆ నీటిలో చుక్క కూడా ముట్టుకోవద్దు. జీసీ లింకులో మళ్లించే జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలి. అప్పుడే నదుల అనుసంధానానికి ఒప్పుకొంటామని స్పష్టంగా చెప్పినం. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా జీసీ లింకుకు కేంద్రం ఒప్పుకొన్నది. ఏ రాష్ర్టానికి ఎన్ని నీళ్లు అనేది నిర్ణయించింది.
తెలంగాణ నుంచే కావేరికి నీళ్లు తీసుకుపోయేలా సిద్ధం చేసిన మెమోరాండం కూడా బేసిన్ రాష్ర్టాలకు పంపింది. 2024 జూన్ 10న జరిగిన మీటింగ్‌లో మధ్యప్రదేశ్, 2024 జూన్ 11న తమిళనాడు, 2026 సెప్టెంబర్ 3న కర్ణాటక, పుదుచ్చేరి ఇలా అన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలకు ఒప్పుకొన్నయ్. ఇచ్చంపల్లి, లేదంటే సమ్మక్కసాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకెళ్తే తెలంగాణకు నీళ్లు వస్తయ్. కరువు వచ్చినా ముందుగా మనం వాడుకోవచ్చు’ అని వివరించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారని, తాజాగా కేంద్ర మంత్రికి రాసిన లేఖలోనే ఆ విషయాన్ని వెల్లడించారని వివరించారు.
ప్రధానంగా గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి, లేదంటే సమ్మకసాగర్ నుంచి చేపట్టాలని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిందని, ఆ ప్రకారం నీటిని డైవర్ట్ చేస్తే ఏపీకి తీవ్ర నష్టమని, ఎలాంటి లాభం లేదని, పోలవరం, ఇతర ప్రాజెక్టుల నీటి వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బాబు లేఖ రాశారని వివరించారు. గోదావరి నుంచి తరలించిన నీటిని నేరుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వదలడానికి బదులు, 150 టీఎంసీల బొల్లాపల్లి రిజర్వాయర్‌ను వినియోగించాలని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారని, అసలు ఇచ్చంపల్లి వద్దు, పోలవరానికి మార్చాలని అంటున్నారని గుర్తుచేశారు.
మరి తెలంగాణ హకులు ఏం కావాలని ప్రశ్నించారు. ‘అదే జరిగితే పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితేంది? 139 టీఎంసీలకు హక్కుల రక్షణ ఉంటుందా? వార్దా, సమ్మక, మూడో టీఎంసీలకు అనుమతివస్తుందా? ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా జీసీ లింకు చేపడితే తెలంగాణలో ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 2,38,236 ఎకరాలకు నీళ్లందుతయ్. ఇప్పుడు ప్రతిపాదన మార్చితే ఆ ఆయకట్టు పరిస్థితేంది? తెలంగాణ పరిశ్రమలకు నీళ్లు, తాగు, సాగు నీటి పరిస్థితేంది?’ అని నిలదీశారు.

కృష్ణాలోనూ తీరని అన్యాయం
చంద్రబాబు లేఖ రాసి పది రోజులవుతున్నా రేవంత్‌రెడ్డికి సోయి లేదని, పెదవి విప్పడం లేదని హరీశ్ విమర్శించారు. అసలు ఇంటర్ లింకింగ్ నుంచి సమ్మక సాగర్‌ను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. ‘గతంలో సమ్మక సాగర్‌కు 47 టీఎంసీల అనుమతి ఇవ్వొద్దు. ఇస్తే పోలవరం ప్రాజెక్టుకు నష్టం అవుతుంది అని ఏపీ లేఖ రాసింది. వాళ్లు వెంటనే డీపీఆర్ వాపస్ పంపిండ్రు. ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో గోదావరి-కావేరి లింకు చేపడితే రాష్ర్టాలకు విన్‌విన్ సిట్యుయేషన్ అని చంద్రబాబు అంటున్నరు. అది ఏ విధంగానో చంద్రబాబు చెప్తారా? రేవంత్ చెప్తారా? కేంద్రం చెప్తదా?’ అని నిలదీశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీకి వెళ్లారని, చేయిచేయి కలుపుదాం దక్షాణాదికి మేలు చేసుకుందామని మాట్లాడుకున్నారని, అసలు ఏం జరుగుతుందో తెలుసా రేవంత్‌రెడ్డీ?’ అని దుయ్యబట్టారు. జీసీ లింకు ముసుగులో చంద్రబాబు ప్రతిపాదనలతో కృష్ణాలోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదని వివరించారు. పోలవరం నుంచే లింకు చేపట్టే ప్రతిపాదనలకు ఒప్పించేందుకు కర్ణాటకకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని వివరించారు. గోదావరి జలాలను తాము వాడుకుంటామని, అందుకు అంగీకరిస్తే ఎగువన ఆల్మట్టిలో మరో 16 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవచ్చని అంగీకారం తెలిపారని వెల్లడించారు. ఇప్పటికే పోలవరం డైవర్షన్‌లో 21 టీఎంసీలను వాడుకుంటున్నదని, ఇప్పుడు మరో 16 టీఎంసీలు అంటే మొత్తంగా 37 టీఎంసీలు కృష్ణాలో ఆగిపోతాయని వివరించారు. ఫలితంగా పాలమూరు జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని వివరించారు.
ఎల్ నినో నేపథ్యంలో నీళ్ల ప్రాధాన్యం అర్థమైన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, తెలంగాణ రాష్ట్రం, ప్రజానీకం శాశ్వతమని, రాష్ట్ర నీటి హకులను కాలరాసే హకు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, 16 మంది ఎంపీలకు నీటిహక్కులను కాపాడే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. కేఎల్ రావు ప్రణాళికలు గొప్పవని ఏపీయే కీర్తిస్తున్నదని, కానీ గోదావరి- కావేరి లింకును ఇచ్చంపల్లి మీదుగా తీసుకుపోవాలని ఆయనే చెప్పారని గుర్తుచేశారు.
హక్కులు కాలరాస్తే ప్రజా ఉద్యమమే..
‘తెలంగాణ జాతికి మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇది ఊరుకునే గడ్డ కాదు. ఎలాంటి పోరాటానికైనా సిద్ధం’ అని హరీశ్ హెచ్చరించారు. ‘బాధ్యత లేనివాడు సీఎం అయితే ఎట్లుంటదనేదానికి తెలంగాణ బెస్ట్ ఉదాహరణ’ అని దెప్పిపొడిచారు. ‘ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలను జీసీ లింకుకు మళ్లించాలనే లక్ష్యంతో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఆ 148 టీఎంసీల్లో తెలంగాణకు 43, ఏపీకి 44, తమిళనాడుకు 42.5, పుదుచ్చేరికి 2.5, కర్ణాటకకు 16 టీఎంసీలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ ఆ నీళ్లన్నీ చంద్రబాబే తీసుకుపోతే తెలంగాణ ఏం కావాలె?’ అని నిలదీశారు. ‘నేషనల్ ప్రాజెక్టు అంటున్నరు. దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం.. మరి ఒక రాష్ర్టానికి నష్టం చేసేది నేషనల్ ప్రాజెక్టు ఎలా అవుతది? కాళేశ్వరం, పాలమూరుకు నేషనల్ ప్రాజెక్టు హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్టు కూడా వద్దా?’ అని నిప్పులు చెరిగారు.
నిజమైన కాంగ్రెస్ నాయకుల్లారా..
తెలంగాణ గడ్డకు పచ్చ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ఇప్పటికైనా అడ్డుకోండి. ఇకనైనా బాబుకు చేసే బానిసత్వం మానుకోండి.. తెలంగాణ జల హకులను కాపాడండి. లేదంటే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలించివేస్తం.. బీజేపీకి కూడా బుద్ధి చెప్తం.
-హరీశ్‌రావు
పంప్‌హౌస్‌లకు పోదామా.. వైఫల్యాన్ని నిరూపిస్తా
‘ఎల్ నినో ప్రభావం ఉంటుందని 9 నెలల నుంచి మేము, శాస్త్రవేత్తలు, తెలంగాణవాదులు మొత్తుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు’ అని హరీశ్ మండిపడ్డారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేతులెత్తేసి, రైతులు, ప్రజలను ‘మీ సావు మీరు సావండి’ అంటున్నాడని నిప్పులు చెరిగారు. ‘ఏదైనా కొనగలం.. కానీ నీళ్లను కొనలేం’ అంటున్న రేవంత్‌రెడ్డి మరి ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారని, ఎందుకు ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి నీటిని వదిలిపెడితే పట్టిసీమ ద్వారా చంద్రబాబు ఒడిసి పట్టిండని, మనకన్నా తక్కువ వర్షపాతం ఉన్న ఏపీలో క్రాప్‌హాలిడే లేదని గుర్తుచేశారు. కానీ ఇకడ మాత్రం పంటలు వేయొద్దని రేవంత్ చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. శ్రీశైలంలో నీళ్లున్నా మోటర్లను మూడు నాలుగు గంటలకు మించి నడుపలేదని, కన్నెపల్లిలో మోటార్లు నడపాలని డిమాండ్ చేస్తే పట్టించుకోలేదని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే బారాణా తెలంగాణకు, హైదరాబాద్‌కు నీళ్లు ఇచ్చే అవకాశమున్నా రేవంత్ సర్కార్ రాజకీయాలు చేస్తూ లేని కరువును తెచ్చిందని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ హెచ్చరించినట్టు ‘కత్తి పరాయి వాడిదే కానీ..పొడిచే చెయ్యి మనోడిదే’ అన్నట్టు పరిస్థితి తయారైంది. ఆ ‘చెయ్యి’ తెలంగాణ నోట్లో మట్టికొడుతున్నది. ఆ చెయ్యి మన ఎవుసాన్ని కూలగొట్టి, పరాయి పల్లకీ మోస్తున్నది. తెలంగాణ నీటి హకులను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతున్నది. గురుదక్షిణ అని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నడు. కానీ అది అంతకు మించిన జాతి ద్రోహం. ఈ జల ద్రోహానికి భవిష్యత్తు తరాలు కూడా నిన్ను క్షమించవు రేవంత్‌రెడ్డీ..
-హరీశ్‌రావు
ఢిల్లీలో నవంబర్ 3న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం ఉన్నది. అందుకు సంబంధించిన ఎజెండాను అన్ని రాష్ర్టాలకు పంపింది. ఎజెండాలో గోదావరి-కావేరి లింకును చేర్చిండ్రు. ఆ ముసుగులో తెలంగాణపై పెద్ద కుట్రకు తెరతీసిండ్రు. తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమైండు. ఆ కుట్రలను తిప్పికొట్టాల్సింది పోయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువుకు దాసోహమై చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్నడు.
-హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

