మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు!
మేడిగడ్డ వద్ద ఇప్పటికీ జలగలగలలు వినిపిస్తున్నాయి. గోదావరిలో జీవధార దిగువకు తరలిపోతున్నది. ఇప్పటి కరువు పరిస్థితుల్లోనూ రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టే అవకాశం ఉన్నది. ప్రాణహిత నుంచి ఈ రోజుకీ 22,900 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది.
- నీళ్లు లేవంటూనే ఇప్పటికీ వరదను దిగువకు వదులుతున్న కాంగ్రెస్ సర్కార్
- బరాజ్ లెవల్ మెయింటెయిన్ చేసినా చాలు
- జియోట్యూబ్ టెక్నాలజీతోనూ అడ్డుకట్ట వేయొచ్చు
- రూ.9 కోట్లు వెచ్చిస్తే నీటి తరలింపు సుసాధ్యమే
- గాబ్రియల్ టెక్నాలజీతోనూ మళ్లించే చాన్స్
- అయినా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్
- రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
- మేడిగడ్డ వద్ద 23వేల క్యూసెక్కుల ప్రవాహం
- రోజుకు రెండు టీఎంసీలు ఒడిసిపట్టే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): కొద్దిపాటి నిధులను వెచ్చించి చిన్నపాటి అడ్డుకట్ట వేసుకుంటే చాలు ఆ జలాలను మళ్లించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కండ్లుండీ చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. జలాలను దిగువకు వృథాగా వదిలిపెడుతూ ప్రభుత్వం చోద్యంచూస్తున్నది.
రాజకీయాలకే పరిమితమై రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతున్నది. కేవలం కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతో సర్కార్.. రాజకీయాలకే పరిమితమై తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతున్నదని రైతులే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కరువు బారి నుంచి కాపాడే బదులు.. జీవధార ప్రాణహిత జలాలను వృథాగా దిగువకు వదిలేస్తున్నది. ఎల్ నినో నేపథ్యం, సర్కార్ నిర్లక్ష్యం వెరసి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరుకునే దశలో ఉన్నాయి. గోదావరి, కృష్ణా తదితర ప్రధాన నదులకు వచ్చిన ప్రవాహాలు అంతంతే. ఇప్పుడు పూర్తిగా ప్రవాహాలు నిలిచిపోయాయి. కానీ ఈ ఏడాది ఎప్పటిలాగే ప్రాణహితలోనూ భిన్నమైన పరిస్థితి కండ్లారా కనిపిస్తున్నది.
22,900 క్యూసెక్కుల జలప్రవాహం
శనివారం సాయంత్రం నాటికి సైతం మేడిగడ్డ వద్ద 22,900 క్యూసెక్కుల జలప్రవాహం నమోదైంది. అంటే సగటున రోజుకు 2 టీఎంసీలు అన్నమాట. ఆ జలాలను ఎత్తిపోసుకునేందుకు ఇప్పటికీ అవకాశం మెండుగా ఉన్నది. వాస్తవంగా ఈ కరువు సీజన్లోనూ 750 టీఎంసీల జలాలు వచ్చి దిగువకు జారిపోయాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి మొదలు దిగువన ఉన్న పార్వతి, సరస్వతి బరాజ్‌లకు ఎగువ నుంచి ఒక్క చుక్క నీరు రావడం లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ వద్ద ఇప్పటికీ నీటిప్రవాహం కొనసాగుతున్నది.
కన్నెపల్లి నుంచి ఒడిసిపట్టొచ్చు
మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో మినహా మిగతా మరేచోట సాంకేతిక లోపాలు లేవనేది ఇప్పటికే నివేదికలు వచ్చాయి. ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా బరాజ్ ఎగువన, దిగువన ఉన్న సీసీ బ్లాక్‌లను సైతం గతంలోనే పునరుద్ధరించారు. రక్షణ చర్యలన్నీ చేపట్టారు. 7వ బ్లాక్ ఆప్స్ట్రీమ్లో 20వ పిల్లర్‌కు ఎదురుగా 400 క్యూబిక్ మీటర్ల మేర ఏర్పడిన బొయ్యారాన్ని సైతం సిమెంట్, ఇసుక మిశ్రమంతో నింపి (గ్రౌటింగ్) పూడ్చివేశారు. ఈ 20వ పిల్లర్ మినహా బరాజ్‌లో మరేచోట లోపాలు లేవని సాంకేతిక పరీక్షల్లోనూ తేలిందని అధికారవర్గాలే చెప్తున్నాయి. బరాజ్‌ను పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకున్నా, కనీసం కన్నెపల్లి మోటర్లకు నీళ్లు అందేందుకు వీలుగా నిర్వహించవచ్చు. కాళేశ్వరంలోని కీలకమైన ఈ కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని పం పింగ్ చేసేందుకు 93 మీటర్ల నీటిమట్టం ఉండాలి. ఆ లెవల్‌ను మెయింటెయిన్ చేస్తూ ప్రాణహిత జలాలను ఒడిసిపట్టొచ్చు. తెలంగాణలోని అత్యధిక ప్రాంతాలకు ఆ నీటిని తరలించవచ్చు.
జియోట్యూబ్ టెక్నాలజీతో అడ్డుకట్ట
బరాజ్‌ను కనీస లెవల్ వరకు మెయింటెయిన్ చేయకపోయినా కూడా నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ఇంజినీర్లు వివరిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండా, ఆపరేషన్‌లో పెట్టకుండానే గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు వీలుగా గతంలోనే అనేక ప్ర ణాళికలు సిద్ధం చేశారు. బరాజ్ ఎగువన జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా అడ్డుకట్ట వేసి గోదావరి జలాలను కన్నెపల్లి పంప్‌హౌస్‌కు మళ్లించవచ్చని, తద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులు తేల్చిచెప్తున్నారు. కిలోమీటర్ మేర అడ్డుకట్ట నిర్మించాల్సి ఉంటుందని, అందుకు రూ.9 కోట్ల మేర నిధులు ఖర్చవుతాయని అధికారులు గతంలోనూ అంచనా వేశారు. ఇప్పటికే అన్నారం, సుందిళ్ల బరాజుల్లోని లీకేజీలను అధికారులు అరికట్టారు. గ్రౌటింగ్ పూర్తిచేశారు. ఆయా బరాజ్‌లను సైతం నీటి పంపింగ్‌కు అవసరమైన నిర్ణీత లెవల్‌ను మెయింటెయిన్ చేస్తూ నీటిని తరలించవచ్చని ఇంజినీర్లు నొక్కిచెప్తున్నారు.
గాబ్రియల్ టెక్నాలజీతోనూ మళ్లించే చాన్స్
జియోట్యూబ్ టెక్నాలజీ కాకున్నా సరిహద్దు ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించే గాబ్రియల్ టెక్నాలజీని వినియోగించి కూడా నీటిని మళ్లించవచ్చని ఇంజినీర్లు చెప్తున్నారు. నీటి ప్రవాహానికి అడ్డుగా బండరాళ్లను వేసి, అవిచెదిరిపోకుండా ఇనుప జాలీని వినిగియోగించవచ్చు. అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు మళ్లించి తరలించుకునే అవకాశం ఉన్నదని ఇంజినీర్లు సూచిస్తున్నారు. గతంలోనే ఆ ప్రణాళికలపై కసరత్తు కూడా చేశారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన దాఖలాల్లేవని పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

