మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి, సాగునీటి మంత్రి ఉత్తమ్‌తోపాటు ఇతర మంత్రుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి వెల్లడించారు.
- తన వైఫల్యాలు హైకమాండ్‌కు వివరించిన
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ టార్గెట్
- ప్రజల్లో వారిని దోషిగా చూపేందుకు సీఎం ప్లాన్
- సీఎం పదవి ఊడగొట్టేందుకు మంత్రుల ప్రయత్నం
- ప్రభుత్వంలో పరాకాష్టకు చేరినప్రచ్ఛన్నయుద్ధం
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
జగిత్యాల, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఒకరి ఉద్యోగం మరొకరు ఊడగొట్టేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారని, ప్రధానంగా సీఎంను తొలగించేందుకు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రయత్నిస్తుంటే.. డిప్యూటీ సీఎంతోపాటు కొంత మంది మంత్రులను సీఎం టార్గెట్ చేసి.. వారి కొలువులకు ఎసరు పెట్టేందుకు పావులు కదుపుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రేవంత్ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత వంటి అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌గాంధీతోపాటు, కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించారని, దీంతో ఆ ఇద్దర్ని సీఎం టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగానే వారు నిర్వహిస్తున్న శాఖల్లో విఫలమయ్యారంటూ ప్రజాక్షేత్రంలో దోషులుగా చిత్రికరీంచేందుకు రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
విద్యుత్తు శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేకుండానే ఆ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించడమే కాదు.. సమీక్షలో ‘మీరు మారడం లేదు. ఉత్పత్తి జరుగడం లేదు. ఉద్యోగం ఊడుద్ది’ అంటూ హెచ్చరికలు జారీ చేయడం వెనుక మతలబు ఇదేనని ఆయన స్పష్టంచేశారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన అనేక సమీక్షల్లో తన వైఫల్యాలను స్పష్టంగా అంగీకరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో కేంద్రం కల్పించుకొని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ‘నమస్తే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలను వెల్లడించారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల మధ్య విభేదాలున్నాయని మీరు ఎలా చెప్పగలరు?
జీవన్‌రెడ్డి: ఈ విషయంలో నాకు పక్కా సమాచారం ఉన్నది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే కాదు.. తీవ్ర విభేదాలు ఉన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన వైఫల్యాలు, ఆయన చేస్తున్న అవినీతి, ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, ప్రజాగ్రహం తదితర విషయాలన్నింటిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు, రాల్గాంధీ, ప్రియాంకగాంధీకి నివేదిక రూపంలో వివరించారు. రాష్ట్రంలో పాలన సరిగా లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నదని వారు వివరించడంతో డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎంకు మధ్య అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి.
రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రుల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయి?
జీవన్‌రెడ్డి : ప్రధానంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తాజా పరిస్థితుల ప్రకారం భట్టిని సీఎం పక్కాగా టార్గెట్ చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనం మూడుసార్లు మంత్రిగా చేసిన అనుభవం నాకు ఉన్నది. సహజంగా సీఎం శాఖలపై సమీక్ష నిర్వహిస్తే, సంబంధిత మంత్రి తప్పనిసరిగా ఉంటారు. కానీ, రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యుత్తుపై సమీక్షలో భట్టి విక్రమార్క లేకుండానే నిర్వహించడం వారి మధ్య ఉన్న విభేదాలను బయట పెట్టింది. ప్రధానంగా సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించిన తీరును నిశితంగా చూడాలి. ఆ మాటలను అధికారులను ఉద్దేశించినవి కావు. లోతుగా చూస్తే అవి డిప్యూటీ సీఎంను ఉద్దేశించి మాట్లాడినట్టు స్పష్టమవుతున్నది. ‘మీరు మారరా? యాదాద్రిలో పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదు? ఉద్యోగం ఊడుద్ది’ అంటూ చేసిన వ్యాఖ్యలు భట్టిని దృష్టిలో పెట్టుకొని చేసినవే. ఈ విషయం భట్టికి కూడా అర్థమై ఉంటుంది.
కొలువులు ఊడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట కదా?
జీవన్‌రెడ్డి: రాష్ట్రంలో రేవంత్ అరాచకాలు బాగా పెరిగిపోయాయి. ఎవరినీ లెక్క చేయడం లేదని స్వయంగా మంత్రులే రగిలిపోతున్నారు. ఇదే సమయంలో మంత్రులు లేకుండానే చాలా శాఖలను ముఖ్యమంత్రి నేరుగా సమీక్షిస్తున్నారు. సీఎం దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో కొందరు హైకమాండ్‌కు నివేదికలు పంపుతున్నారు. నాకున్న సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ వంటి అనేక అంశాలపై భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి నివేదిక రూపంలో హైకమాండ్‌కు నివేదించడమే కాదు.. రేవంత్ ఇంకా కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పదవి నుంచి తొలగింపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్‌రెడ్డి.. వీరిద్దరిని ప్రధానంగా టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా మొదట భట్టిపై ప్రధాన ఫోకస్ పెట్టి అతని పోస్టుకు ఎసరు పెడుతున్నారు. ఆ తదుపరి రెండో వరుసలో ఉత్తమ్ ఉన్నారు. ఇలా ఒకరి పోస్టును ఇంకొకరు ఊడగొట్టుకునేందుకు ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.
రేవంత్‌రెడ్డికి అన్నీ అంశాల్లో అవగాహన ఉందంటారా?
జీవన్‌రెడ్డి: విద్యుత్తు సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలే ఆయన అవగాహన రాహిత్యం, పరిపాలన వైఫల్యాలను బయటపెట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికి 7781.99 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదకత ఉంటే 2023-24 నాటికి 20,191 మెగావాట్లకు చేరింది. అంటే రెండు వందల శాతం ఉత్పత్తి, పంపిణీ పెరిగినా ప్రస్తుతం విద్యుత్తు సరఫరా సరిగా కావడం లేదు. ఆయన తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి బొగ్గు నిల్వలు లేవని చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యాదాద్రిలో బొగ్గు లేకున్నా 4వేల మెగావాట్ల ప్రాజెక్టు ఎందుకు పెట్టారంటూ మాట్లాడటం ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని చెప్పడానికి నిదర్శనం.
గతంలో ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే విజయవాడ, కడపలో థర్మల్ ప్రాజెక్టులు పెట్టాయి కదా? అక్కడ బొగ్గు నిల్వలున్నాయా? అలాగే, ఉత్పత్తి, పంపిణీ విషయాలపై అవగాహన లేదు. యాద్రాది పవర్ ప్లాంట్‌ను కేసీఆర్ ముందుచూపుతో రూ.40వేల కోట్లతో నిర్మించారు. ఇప్పుడు నిర్మించాలంటే రెట్టింపు వ్యయం అవుతుంది. నిజానికి కేసీఆర్ అన్ని సౌకర్యాలు కల్పించారు. వాటిని వినియోగించుకొని కరెంటు ఇవ్వలేని అసమర్థ పాలన సీఎం రేవంత్‌రెడ్డిది. ఇవేకాదు.. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న స్వార్థంతో మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోయలేదు. నాయకుడు ప్రజల గురించి అలోచించాలే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. ఇవేకాదు. అయన వైఫల్యాలు రాస్తే రామాయణం అంతా ఉంటాయి. అందుకే ఆయనకు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్తున్నా. ఇది నేను చెప్తున్న మాట మాత్రమే కాదు. ఇప్పుడు సబ్బండ వర్గాలు ఇదే డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు?
జీవన్‌రెడ్డి: మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 356 ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనలో విఫలమైన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కలుగచేసుకొని.. రాష్ట్రపతి పాలన విధించే అధికారం 356 ఆర్టికల్ ద్వారా కేంద్రానికి ఉన్నది. పాలనలో వైఫల్యం చెందానని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకొంటున్నారు గనుక.. కేంద్ర ప్రభుత్వం బాధ్యత పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు నివేదించడం లేదు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 356ను వినియోగించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం లేదు. సీఎం తన వైఫల్యాన్ని స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో ఆర్టికల్ 356ని ప్రస్తావించడం జరుగుతున్నది.
యాసంగి పంటలు వేయొద్దని సీఎం చెబుతున్నారు.. ఇదెలా?
జీవన్‌రెడ్డి: ఇది అన్యాయం.. యాసంగిలో పంటలు వేయకపోతే వచ్చే పరిణామాలపై సీఎంకు అవగాహన లేదు. రాష్ట్రంలో ఉపద్రవం వస్తుంది. పంటలు వేయకపోతే ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడికి చేరుతాయి. డబ్బులు పెట్టినా దినుసులను కొనగలమా? ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యాపారులకు డబ్బులు వస్తాయి కావచ్చు. కానీ, పంటలు పండించడమే లేనప్పుడు ఆహార పదార్థాలను ఎలా కొనుక్కోగలం. దీనిపై సీఎం ఎలాంటి కసరత్తు జరుపకుండానే యాసంగిలో పంటలు సాగు చేయొద్దని చెప్పడం సరికాదు. ఆరుతడి పంటలు వేయండి అని చెబుతున్నారు.
ఆరుతడి పంటలు అని గాలికి చెబితే సరిపోతుందా? నిర్దిష్టంగా ఏ పంటలు వేయాలో ప్రభుత్వం చెప్పాలి. మక్క, సోయా లేదా ఇతర పంటలు వేయమంటారా? ఆ పంటలను కోతుల నుంచి కాపాడేందుకు ఎలా రక్షణ కల్పిస్తారు. వీటిపై నిర్దిష్టమైన ప్రణాళికలు ఉండాలి. అవేవి లేకుండానే పంటలు వద్దంటే సరికాదు. ఈ పాపం వల్ల కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తికి విఘాతం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? పంటలు వేయకపోతే.. బియ్యాన్ని ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలి కదా?
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఏమని వ్యాఖ్యానిస్తారు?
జీవన్‌రెడ్డి: నేను ఏ నాడూ ఇంతటి దారుణమైన పరిస్థితులను చూడలేదు. గతంలో పని చేసిన ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంతటి విధ్వంసం జరుగలేదు. రేవంత్‌రెడ్డికి ఏ రంగంపైనా, ఏ వర్గ ప్రజలపైనా ప్రేమ లేదు. రాజకీయ రంగంలో ఉన్నా, కేసీఆర్‌తోపాటు నాలాంటి చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం భూముల బేరగాన్ని అని ప్రకటించుకున్నాడు. బేరగానికి, రైతుకు తేడా ఉంటుందా? ఉండదా? ప్రజలు అలోచన చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే భయమేస్తున్నది. సీఎం తెలివిలేని తనం వల్ల కరువు ముంచుకు వస్తున్నది. మరో వైపు పాలన నాశనం అవుతున్నది. మొత్తంగా రాష్ట్రంలో అయోమయ పరిస్థితులు గోచరిస్తున్నాయి. కేసీఆర్ వస్తేనే తెలంగాణకు మంచి భవిష్యత్ ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

