వినాయక్‌నగర్, జూలై 17: రుణాల కోసం బ్యాంకును ఆశ్రయించిన ఖాతాదారుల అకౌంట్స్ నుంచి సుమారు రూ.మూడున్నర కోట్లు మేనేజర్ కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు పెద్దబజార్ బ్రాంచీ మేనేజర్ తమ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసినట్లుగా పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
నాల్గోటౌన్ ఇన్చార్జి ఎస్సై పాండేరావ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన పుల్లూరి రాకేశ్ అనే వ్యక్తి రుణం కోసం అవసరమైన షూరిటీ చెక్కులను బ్యాంకు మేనేజర్ అజయ్‌కు అందజేశారు. కొద్దినెలలుగా రాకేశ్ ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే రూ.20లక్షల విలువ చేసే చెక్కులను బ్యాంకు మేనేజర్ అజయ్ నగదుగా మార్చుకోవడంతో విషయం తెలుసుకున్న బాధితుడు నాల్గోటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంకు మేనేజర్ అజయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పాండేరావు బుధవారం తెలిపారు.
ఇదే బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న 24మందికి డబ్బులు చెల్లించాల్సిందిగా బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో బాధితులు కంగుతిన్నారు. తమకు జరిగిన మోసంపై నాల్గో టౌన్ పోలీసు స్టేషన్‌కు బుధవారం తరలివచ్చారు. రుణాలు తీసుకునేందుకు తమ చెక్కులను బ్యాంకులో షూరిటీగా పెట్టడంతో ఆ చెక్కుల ద్వారా తమ అకౌంట్లోని డబ్బులను మేనేజర్ డ్రా చేసుకొని మోసం చేశాడని బాధితులు వాపోయారు.
మరో 24మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో మేనేజర్ అజయ్‌పై కేసు నమోదు చేశామని నగర సీఐ నరహరి పేర్కొన్నారు. యూనియన్ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నుంచి రూ.3 కోట్ల25 లక్షలు మేనేజర్ కాజేసినట్లుగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు. మేనేజర్ కోసం వాకబు చేయగా అతడు పరారీలో ఉన్నట్లు తెలిసిందని, నిందితుడి కోసం అన్వేషిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.