ఖలీల్వాడి/ కామారెడ్డి, మార్చి 12: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. మంగళవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఒకేరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 26మంది విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16మంది, ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 మంది, నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి చీటీలు చూసి రాస్తుండగా తనిఖీ బృందాలు పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు.
జిల్లాలో మొత్తం 16633 మంది విద్యార్థులకు 16136 మంది పరీక్షలకు హాజరుకాగా, 841 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 57 పరీక్షా కేంద్రాల్లో 46 సెంటర్లను తనిఖీ చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ విద్యాధికారి పేర్కొన్నారు. కామారెడ్డిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం జనరల్ 7,543 మంది విద్యార్థులకు 7,319 మంది హాజరయ్యారు. 224 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్లో 1,045 మందికి 1,021 మంది హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.