బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 23, 2020 , 01:00:14

బంజారా సాత్‌వాసి కేసీఆర్‌

బంజారా సాత్‌వాసి కేసీఆర్‌

నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో ముగ్గురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు

దేవీతండాలో ఘనంగా సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ రాజగోపుర ప్రతిష్ఠాపన

హాజరైన మంత్రులు వేముల, ఐకే రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత

త్వరలోనే ప్యాకేజీ 21 ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగు నీరు : మంత్రి వేముల

పోడు పేరితో గిరిజనులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని స్పష్టీకరణ

పోడు వ్యవసాయం సమస్యలుంటే దృష్టికి తీసుకు రండి : ఎమ్మెల్సీ కవిత అభయం

కేసీఆర్‌ పాలనలోనే గిరిజనుల ఆత్మగౌరవం పెరిగింది : మంత్రి సత్యవతి రాథోడ్‌

చెట్లను నరకొద్దు... అడవులను కాపాడుకుందాం : మంత్రి ఐకే రెడ్డి పిలుపు

ఇందల్వాయి రామాలయం పునరుద్ధరణ, బంజారాభవన్‌ నిర్మాణానికి మంత్రుల హామీ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ / డిచ్‌పల్లి, ఇందల్వాయి

నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించారు. ఇందల్వాయి మండలం దేవీతండాలో జరిగిన సేవాలాల్‌ మహరాజ్‌ రాజగోపురం ప్రతిష్ఠాపన మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్‌, బోథ్‌ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్‌ రావు, జనార్దన్‌ రాథోడ్‌, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం గోపురం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. జగదాంబ దేవి, సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమ గుండం వద్ద మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం దేవీతండాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గిరిజనులనుద్దేశించి అతిథులు ప్రసంగించారు. 

అట్టహాసంగా గోపురం ప్రారంభోత్సవం..

ఇందల్వాయి మండలం గన్నారం శివారు జాతీయ రహదారి 44 పక్కన గల దేవీ తండాలో సేవాలాల్‌ మహరాజ్‌ దేవాలయ గోపురం మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎంపీగా ఉన్న సమయంలో కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ చొరవతో మంజూరైన రూ.50 లక్షలతో ఆలయ అభివృద్ధి పనులను చేపట్టారు. పైసా కంట్రిబ్యూషన్‌ లేకుండానే సేవాలాల్‌ దేవాలయం కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. శివరామ్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను సుందరంగా తీర్చిదిద్దారు. గిరిజనుల ఆరాధ్య దైవం రామ్‌రావు మహరాజ్‌ స్వయంగా భూమిపూజ చేసిన ఈ స్థలాన్ని స్థానిక ప్రజలంతా పుణ్య ప్రాంతంగా కొలుస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులకు గిరిజన మహిళలు సంప్రదాయబద్ధ నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న సేవాలాల్‌ మహరాజ్‌ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని గిరిజనులు విన్నవించారు.  

గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

గత పాలకులు గిరిజన ప్రాంత అభివృద్ధిని విస్మరించారని ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేవీఘాట్‌ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందన్నారు. తండాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం కొత్త జీపీలను ఏర్పాటు చేసి పరిపాలన ప్రజల ముంగిట్లోకి తెచ్చిందన్నారు. జడ్పీ చైర్మన్‌దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ.. సేవాలాల్‌ ఆలయం ఎదుటు రాజగోపురం నిర్మించడం ఎక్కడా చూడలేదన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేసిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు ఎమ్మెల్సీ కోటా నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. 

ప్రజల హితం కోసం టీఆర్‌ఎస్‌ పని చేస్తున్నది

- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

గిరిజనులకు పోడు భూముల సమస్య ఉంది. ఈ విషయంపై ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించి స్పష్టంగా ఓ విషయం చెప్పారు. 2005కు ముందు నుంచి సాగు చేసుకుంటున్న భూముల జోలికి పోద్దని సీఎం చెప్పారు. ఒకవేళ అటవీ శాఖ వారు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి. దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వేముల, నేను అందరం కలిసి ఆదుకుంటాం. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ చిన్న కార్యాచరణ మొదలు పెట్టినా అది కేవలం రైతులు, ప్రజల హితం కోసమే ఉంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండబోదు. అధికారుల తొందరపాటుతో, క్లారిటీ లేక తప్పులు జరుగుతున్నాయి. పోడు భూముల విషయంలో ఇబ్బందులుంటే ఎమ్మెల్యే దృష్టికి తెస్తే దగ్గరుండి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.

గతంలో గిరిజనులంటే ఓటు బ్యాంకు మాత్రమే

- సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర మంత్రి

సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఎనలేని మేలు చేకూరుస్తున్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఆరాధ్యుడయ్యారు. రాష్ట్రంలో మూడు వేలకు పైగా తండాలకు మహర్దశ కల్పించారు. గిరిజన బిడ్డల విద్య కోసం లెక్కకు మించి గురుకులాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.40కోట్లతో కుమ్రం భీం, సేవాలాల్‌ భవనాలను నిర్మించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ నిలబెట్టారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ రెండు లక్షల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చారు. వారందరికీ రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారు. దేవీతండాలో బంజారాభవన్‌కు రూ.1.20 కోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

90 శాతం మందికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు

ఇంద్రకరణ్‌ రెడ్డి, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి


పోడు వ్యవసాయం ఎక్కడెక్కడ జరుగుతుందనే లెక్కలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను 90 శాతం మందికి ఇప్పటికే అందజేశాం. సీఎం కేసీఆర్‌ జిల్లాలకు వచ్చి సమావేశం అవుతారు. అప్పుడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గిరిజన దేవాలయాలకు సైతం ఈ పథకం వర్తించేలా చర్యలు చేపడతాం. ఉమ్మడి పాలనలో దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. 33 శాతం కంట్రిబ్యూషన్‌ చెల్లిస్తేనే నిధులు ఇచ్చేవారు. స్వరాష్ట్రంలో 20 శాతానికి దాన్ని తగ్గించాం. యాదాద్రి దేవాలయాన్ని రాతి శిలతో పునర్నిర్మించడం గొప్ప విషయం.  ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందల్వాయి రామాలయం పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తాం. 

అటవీశాఖ అధికారులు గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

పోడు భూముల విషయంలో గిరిజనులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెట్టొద్దు. అటవీ అధికారులు పోడు భూముల్లో కాలు పెడితే బాగుండదు. పాత భూముల్లో సాగు చేసుకునే వారికి పట్టాలిస్తామని కేసీఆర్‌ చెప్పారు. తద్వారా ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21లో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు త్వరలోనే సాగు నీరు అందుతుంది. రూ.2600 కోట్లు ఖర్చు చేసి సీఎం కేసీఆర్‌ పనులు చేపడుతున్నారు. కాళేశ్వరం ద్వారా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి 1.20 లక్షల ఎకరాలకు, బాల్కొండ నియోజకవర్గానికి 80వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. వచ్చే ఏడాది నాటికి కండ్ల ముందే జల సంబురాన్ని చూడబోతున్నాం.

ఉమ్మడి జిల్లా రోడ్లకు మహర్దశ

రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో బీటీ రోడ్ల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నా. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో నాలుగు రోడ్లకు ఇప్పటికే రెండు రోడ్లు మంజూరయ్యాయి. త్వరలోనే మరో రెండు రోడ్లను మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రిగా బీటీ రోడ్ల కోసం ఉమ్మడి జిల్లాకు రూ.250 కోట్లు మళ్లించాం. ఇక తండాలకు లింకు రోడ్ల విషయంలోనూ రూ.500 కోట్లతో తారు రోడ్లు వేసాం. బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసాలు చేసే వారెవ్వరూ టీఆర్‌ఎస్‌ లేరు. ఇచ్చిన హామీలను అమలు చేసే వారే ఉన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

గిరిజన ప్రాంతాలు టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి చెందుతున్నాయి. రూరల్‌ నియోజకవర్గంలో 90కిపైగా తండాలు ఉంటే అందులో 45 జీపీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. పోడు భూములకు పట్టాలు ఇచ్చేలా మంత్రులు సహకరించాలి. సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట్‌ తరహాలోనే నిజామాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేయాలి. రూరల్‌ నియోజకవర్గంలో ఎన్‌హెచ్‌ 44 ఇందల్వాయి స్టేషన్‌ నుంచి సిర్నాపల్లి రోడ్డు వరకు నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు. మంచిప్ప రిజర్వాయర్‌ నుంచి పంటల సాగు కోసం నీరందించేందుకు పనులు జరుగుతున్నాయి. చాంద్రాయన్‌పల్లి, గన్నారం, నల్లవెల్లికి సాగు నీరు అందించాలి. 


logo