బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Oct 03, 2020 , 06:02:42

కాంగ్రెస్‌కు షాక్‌..!

కాంగ్రెస్‌కు షాక్‌..!

ఎన్నికల వేళ ఎదురుదెబ్బ

మంత్రి వేముల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు జడ్పీటీసీలు 

కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాష్‌రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే నేతలు గుడ్‌ బై

కామారెడ్డి జిల్లాలో హస్తం పార్టీ అతలాకుతలం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ / లింగంపేట, నాగిరెడ్డిపేట : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఇప్పటికే సగానికి పైగా మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్‌ జడ్పీటీసీలు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఇందులో ఒకరు జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ ఉండడం గమనార్హం. టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు జడ్పీటీసీల రాకతో జిల్లా పరిషత్‌లో గులాబీ పార్టీ బలం 20కి పెరిగింది. మొత్తం 22 మంది ఉన్న జడ్పీటీసీల్లో 14 మంది టీఆర్‌ఎస్‌ వారు కాగా ఎనిమిది మంది కాంగ్రెస్‌ పార్టీ వారుండగా ఇప్పటికే ఆరుగురు జడ్పీటీసీలు హస్తం పార్టీని వీడారు. మిగిలిన వారు సైతం త్వరలోనే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు జడ్పీటీసీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి సొంత నియోజక వర్గానికి చెందిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

మంత్రి వేముల సమక్షంలో చేరిక..

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముంగిట కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. వరుసగా పార్టీని వీడుతున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో హస్తం పార్టీ అతలాకుతలం అవుతున్నది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డి నుంచి ఇద్దరు జడ్పీటీసీలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌, నాగిరెడ్డిపేట జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డితో పాటు లింగంపేటకు చెందిన మరో కాంగ్రెస్‌ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు ఆత్మకూర్‌ సర్పంచ్‌ గడ్డం బాల్‌రెడ్డి, ఇతర నాయకులు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్నామని ఇద్దరు జడ్పీటీసీలు సంతోషం వ్యక్తం చేశారు.

జనరంజక పాలనను మెచ్చి.. 

కాంగ్రెస్‌ పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేతలంతా రాష్ట్రంలో అమలవుతున్న జనరంజక పాలనను మెచ్చి చేరుతున్నారని, వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలను మంత్రి కండువా కప్పి గులాబీ గూటి కి ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని మంత్రి వేముల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రజల కోసం నిరంతరం పని చేస్తూ రాష్ర్టాన్ని మేటిగా తీర్చిదిద్దుతున్నారని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయా పార్టీల నుంచి భారీగా చేరికలు నమోదు అవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలింగ్‌కు వారం రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో హస్తం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవహించింది. 

కామారెడ్డి జిల్లాలో 22 మంది జడ్పీటీసీలుండగా కాంగ్రెస్‌ నుంచి ఎనిమిది మంది గెలిచారు. ఇప్పటికే నలుగురు జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోగా తాజాగా ఇద్దరి రాకతో టీఆర్‌ఎస్‌ బలం 20కి చేరింది. చేరికల కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దఫేదార్‌ రాజు, సత్యంరావు తదితరులు పాల్గొన్నారు.


logo