సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 06, 2020 , 01:33:28

ఆర్మూర్‌ను అగ్రపథాన నిలుపుతా..

ఆర్మూర్‌ను అగ్రపథాన నిలుపుతా..
  • పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తా..
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత
  • పట్టణ ప్రగతిపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం..
  • వందశాతం ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు
  • హరితహారం... పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం
  • విలీన గ్రామాల రూపురేఖలు మారుస్తా..


ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : ఆర్మూర్‌ ఎమ్మె ల్యే, అసెంబ్లీ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ(పీయూసీ) చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సహకారం తో ఆర్మూర్‌ మున్సిపల్‌ను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుపుతానని ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్స న్‌ పండిత్‌ వినీత అన్నారు. ఇటీవల ఆర్మూర్‌ ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన పండిత్‌ వినీత బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. వివరాలు ఆమె మాటాల్లోనే..


నమస్తే, తెలంగాణ : ఎవరి ప్రోద్బలంతో రాజకీయల్లోకి వచ్చారు? రాజకీయాల్లోని రావడానికి గల కారణం?

పండిత్‌ వినీత : నేను రాజకీయాల్లోకి మా మరిది పండిత్‌ ప్రేమ్‌, భర్త పండిత్‌ పవన్‌ల ప్రోద్బలంతో, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మ న్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆశీర్వాదంతో వచ్చా. మ మారిది పండిత్‌ ప్రేమ్‌ ఆశయాలకు అనుగుణంగా ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చా. 


తొలిసారిగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించి చైర్‌పర్సన్‌ పదవి పొందారు. దీనిపై మీ అనుభూతి ఏంటి?

ఈ దఫా ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆర్మూర్‌ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆశ్వీర్వాదంతో, మా మరిది పండిత్‌ ప్రేమ్‌ ప్రోద్బలంతో 33వ మున్సిపల్‌ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా పోటీ చేశా. గత పాలకవర్గంలో మా మరిది పం డిత్‌ ప్రేమ్‌ చేసిన అభివృద్ధి పనులతో వార్డు ప్రజ లు ప్రచారంలో బ్రహ్మరథం పట్టి కౌన్సిలర్‌గా గెలిపించిండ్రు. ఆర్మూర్‌ చైర్‌పర్సన్‌ రేసులో ఏడుగురు అభ్యర్థినులు పోటీ పడ్డారు. రెండు రోజులు క్యాంపులో ఏడతెగని ఉత్కంఠ, టెన్షన్లతో ఆర్మూ ర్‌ మున్సిపల్‌కు చేరుకున్నాం. మున్సిపల్‌ సమావేశపు గదిలో సీల్డ్‌ కవర్‌లో నా పేరును చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అధికారులు ప్రకటించిన సమయంలో నా కండ్లలోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి ఆశీర్వాదంతో, నా మరిది పండిత్‌ ప్రేమ్‌ లాయల్టీతోనే నాకు చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలకు నా జీవితాంతం రు ణపడి ఉంటా. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పదవి చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. 


మీ కుటుంట నేపథ్యం ఏంటి.. మీ చదువు ఎలా, ఎక్కడ సాగింది? 

నా మెట్టినిల్లు, పుట్టినిల్లు అయిన పండిత్‌, అల్జాపూర్‌ రెండు కుటుంబాలు రాజకీయ నేప థ్యం కలిగిన కుటుంబాలే. దీంతో సహజంగా నాకు రాజకీయాలపై మక్కువ. నా చిన్నతనం నుంచి పుట్టింట్లో, పెండ్లయ్యాక మెట్టినింట్లో మొత్తం రాజకీయాలు చేసే వ్యకులతోనే కాలం గడిపాను. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి పట్టణంలోని శిశుమందిర్‌లో, 8, 9వ తరగతులు పట్టణంలోని ప్రజ్ఞ హైస్కూల్‌లో, 10వ తరగతి హైదరాబాద్‌లోని వాణి ఎడ్యుకేషన్‌ సంస్థలో చది వా. ఇంటర్మీడియెట్‌ను హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో కూకట్‌పల్లి బ్రాంచ్‌లో పూర్తిచేశా. బీటెక్‌, ఎంటెక్‌లను ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుకున్నా. గుంటూరులోని వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైర్‌లెస్‌ సెన్సార్‌ నెట్‌వర్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నా.  


చైర్‌పర్సన్‌గా మీకున్న లక్ష్యాలు ఏమిటి?

ఆర్మూర్‌ మున్సిపల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యం. ఆర్మూర్‌ ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతో, ఆర్మూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆశీర్వాదంతో ఆర్మూర్‌ మున్సిపల్‌ను సిరిసి ల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తరహాలో అభివృద్ధి చేయిస్తా.  


పట్టణ అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు?

నూతన మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులందరినీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ పట్టణాల సందర్శనకు తీసుకెళ్తాం. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి ఆర్మూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి సూచనల మేరకు ఆచరణలో పెడ్తాం. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆదేశాలతో పట్టణంలో ‘మన వార్డు-మన అభివృద్ధి-మన ఎమ్మె ల్యే’ కార్యక్రమాన్ని మున్సిపల్‌లోని 25వ వార్డులో ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమా న్ని ప్రతి వార్డులో చేపట్టి ఆర్మూర్‌ను స్వచ్ఛ ఆర్మూర్‌గా తీర్చిదిద్దుకుంటాం. ప్రధానంగా స్లమ్‌ ఏరియాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తా.   


ఉన్నత విద్యనభ్యసించిన మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఏవిధమైన దృక్పథంతో ముందుకుసాగనున్నారు? 

పీహెచ్‌డీ చదువుకున్న నేను ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా. పట్ణణంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి మున్సిపల్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సుల నిర్వహణకు రూపకల్పన చేస్తా. అమీర్‌పేట్‌ లాంటి ప్రాంతాల్లో ఉండి నెలకు కనీసం 6 వేల నుంచి 8 వేల వరకు వెచ్చించి యువతీ, యువకులు శిక్షణ తీసుకుంటుండ్రు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ను ఇటీవల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులందరితో క్యాంప్‌ ఆఫీస్‌లో దరఖాస్తులు చేయించి ఉద్యోగాలు పొందేలా చూస్తా. మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందేలా కార్యక్రమాలను రూపొందిస్తా. మహిళలకు జూట్‌ బ్యాగుల అమ్మకాల్లో, నర్సరీల పెంపకాల్లో శిక్షణ ఇప్పిస్తా.


రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిని ప్రారంభించనుంది. దీన్ని ఏవిధంగా అందిపుచ్చుకోనున్నారు?

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రగతి ప్రారంభించనున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి వచ్చే నిధులు ప్రాధాన్యతా క్రమంలో పనుల కు కేటాయించి పూర్తి చేస్తాం. పట్టణంలోని అన్ని వార్డులను స్వచ్ఛంగా  తీర్చిదిద్దడమే లక్ష్యంగా పట్టణ ప్రగతిని వాడుకుంటాం. పట్టణ ప్రగతిలో వార్డు వారీగా వచ్చే నిధులను ఆయా వార్డుల్లోనే అభివృద్ధి పనులకు కేటాయించి పనులు చేసి అభివృద్ధి చూపుతా. 


హరితహారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. దీన్ని పట్టణంలో ఎలా అమలుపర్చబోతుండ్రు? 

రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని కొన్నేండ్లుగా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. మొక్కల పెంపకాలతో భావితరాల మనుగడ సాధ్యం. పట్టణంలో ఈ వేసవిలో నర్సరీల్లో మొ క్కలను పెంచి వచ్చే వానాకాలం సీజన్‌లో లక్ష్యానికి మంచి మొక్కలు నాటించి పెంపకాలు చేపడతాం. మొక్కల పెంపకాలతో వాతావరణ సమతులత్య సాధ్యపడుతుంది. మొక్కలను నాటడంతోనే వదిలివేయకుండా వాటి పెంపకాల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తాం. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చేపడుతున్నాం. అవసరమైతే మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బందిని పెంచుకుంటాం. వార్డుల వారీగా సిబ్బందిని కేటాయిస్తూ వారిపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు చేయిసున్నా. 


పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణకు, ప్లాస్టిక్‌ వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

ఆర్మూర్‌ పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించాం. సేకరించిన చెత్తను వేర్వేరుగా డంపింగ్‌ యార్డులకు చేరవేయిస్తున్నాం. ట్రాక్టర్లు, ఆటోలతో మున్సిపల్‌ సిబ్బందితో చెత్త సేకరణపై నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. పట్టణంలో ప్లాస్టిక్‌ వినియోగంపై ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టబోతున్నాం. ప్లాస్టిక్‌ విక్రయాలు జరిపే దుకాణాదారులతో మొదట మున్సిపల్‌లో సమావేశం నిర్వహిస్తాం. సమావేశంలో ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, ప్లేట్స్‌ అమ్మకాలు చేయవద్దని సూచించనున్నాం. విక్రయదారుల్లో మార్పు రాకపోతే మున్సిపల్‌ అధికారులతో తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించడానికి వెనుకాడబోం. అయినా తీరు మార్చుకోకపోతే ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసుల అమ్మకందారుల దుకాణాల లైసెన్సులను రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  


విలీన గ్రామాల అభివృద్ధికి ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లనున్నారు? 

ఆర్మూర్‌ మున్సిపల్‌లో పెర్కిట్‌, కోటార్మూర్‌, మామిడిపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల అభివృద్ధికి గత ఏడాది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌తో రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించారు. త్వరలోనే ఈ నిధులతో మూడు విలీన గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాల ను, సెంట్రల్‌లైటింగ్‌, డివైడర్‌ పనులు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి పనులను చేపడతాం. అభివృద్ధి పనులతో విలీన గ్రామాల రూపురేఖలను మారుస్తా. 


ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారం, అధికార పార్టీ అండ పట్టణాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారా? 

ఆర్మూర్‌ పట్టణాన్ని ఇప్పటికే ఆర్మూర్‌ ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి గతంతో పోల్చితే ఎంతో అభివృద్ధి చేశారు. రానున్న ఐదేండ్ల కాలంలో అధికార పార్టీలో ఉండడం, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి అండగా ఉండడం ఆర్మూర్‌ పట్టణ అభివృద్ధికి వందకు వందశాతం దోహదపడుతుంది. పట్టణ అభివృద్ధిని మున్సిపల్‌ నిధులతో పాటు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతో, చొరవతో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో నిధుల మంజూరు చేయించుకుంటాం. 


logo