నిజామాబాద్, నవంబర్ 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై హైకోర్టు కొరడా ఝులిపించడంతో 2012 నియామకాలు రద్దు అయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ భీమపాక ఇచ్చిన తీర్పును అనుసరించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ యూనివర్సిటీ మీన మేషాలు లెక్కిస్తోంది. ఉత్తర్వులను అధికారికంగా జారీ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం పూర్తి స్థాయి టీయూ పాలకవర్గం(ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ – ఈసీ) లేదు. అంతర్గత పాలకవర్గం మనుగడలో ఉంది. ఇందులో ప్రభుత్వం నుంచి నియామకమైన సభ్యులు లేరు. 8 మందితో కూడిన అంతర్గత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ – ఈసీ త్వరలోనే భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఇంటా బయటా విమర్శలు పెరుగుతుండటడం, హైకోర్టు తీర్పు మెడపై వేలాడుతుండటంతో ఈ చట్రం నుంచి బయట పడేందుకు ఈసీ మీటింగ్ నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలంగాణ యూనివర్సిటీ వెల్లడించలేదు. ప్రతి చిన్న విషయాన్ని బయట పెట్టే యూనివర్సిటీ పెద్దలు ఈ వ్యవహారంలో తీవ్రమైన గోప్యతను పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంపై ఇప్పటికే టీయూ పెద్దలపై విమర్శలు పెరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థ ఆదేశాలను గౌరవించి వాటిని పాటించాల్సిన వీసీ, రిజిస్ట్రార్లే వితండవాదంతో కాలక్షేపం చేస్తున్నారు. తద్వార 2012లో నియామకైన హైకోర్టు తీర్పుతో రద్దు కాబడిన వారికి పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లుగా అవగతం అవుతోంది.
ఈ వారంలోనే ఈసీ భేటీ..
హైకోర్టు తీర్పును బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు తెలంగాణ యూనివర్సిటీ పెద్దలు అక్టోబర్ 31 నుంచి పాకులాడారు. తీర్పు ప్రజా బాహుళ్యంలోకి రావడంతో ఏమీ చేయలేక సతమతం అవుతున్నారు. ఓ వైపు హైకోర్టు తీర్పును ఆమోదించలేక తాత్సారం చేస్తూనే తీర్పుకు వక్రభాష్యం చెప్పేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో టీయూ పెద్దల తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పు వెలువడిన 9 రోజులకు ఈసీ మీటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఆర్థిక శాఖ, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమయం ఇవ్వడం గగనమయ్యే అవకాశం ఉంది. వారు సమయాన్ని కేటాయిస్తే ఈ వారంలోనే ఈసీ భేటీ జరుగనుంది. ఇందులో హైకోర్టు తీర్పు పర్యావసానాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తదుపరి నిర్ణయాన్ని తీసుకునే వీలుంది.