ఖలీల్వాడి/కామారెడ్డి, సెప్టెంబర్ 13 : స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన అధికార యంత్రాం గం.. పంచాయతీల వారీగా ము సాయిదా ఓటరు జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14.60 లక్షల ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చింది. రెండు జిల్లాల్లోనూ మహిళలే అత్యధికంగా ఉండడం విశేషం. అన్ని పంచాయతీల్లో జాబితాలను అధికారులు ప్రదర్శనకు ఉంచారు. వాటిపై అభ్యంతరాలకు అవకాశం కల్పించిన అధికారులు.. వాటిని పరిష్కరించి, ఈ నెల 28న తుది జాబితాను విడుదల చేయనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ముసాయిదా జాబి తా ప్రకారం మొత్తం ఓటర్లు 8,29,463 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3,86,493 మంది కాగా, మహిళలు 4,42,955, ఇతరులు 15 మంది ఉన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పంచాయతీల్లోని నోటీసుబోర్డులపై శుక్రవారం ముసాయిదా ఓటరు జాబితాలను ప్రదర్శనకు ఉంచారు.
కామారెడ్డి జిల్లాలోని 535 గ్రామాల్లో కలిపి మొత్తం 6.36 లక్షల ఓటర్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ జిల్లాలోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. పురుషులు 3,06,538 మంది ఉండగా, మహిళలు 3,29,747, ఇతరులు 15 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలను అన్ని గ్రామపంచాయతీల్లో ప్రదర్శనకు ఉంచారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21 లోపు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరోవైపు, ఓటరు జాబితాపై ఈ నెల 18న జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుండగా, 19వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు రాజకీయ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ముసాయిదా జాబితాలపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 26లోగా పరిష్కరించి, 28వ తేదీన ఫొటోతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు అధికారులు తెలిపారు.