పంట రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఉమ్మడి జిల్లా రైతాంగం గురువారం సంబురాల్లో మునిగి పోయింది. ఊరూరా రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పంటల సాగుకు పెట్టుబడి ఇవ్వడమే కాకుండా ఇప్పుడు రుణ విముక్తి చేస్తున్న రైతుబాంధవుడికి ధన్యవాదాలు తెలిపారు. స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చి వేడుకలు జరుపుకొన్నారు. అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా ఉంటున్న కేసీఆర్ సారును మరువబోమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న చంద్రశేఖరా జయహో అని నినదించారు.
రైతు రుణమాఫీ ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తంచేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని గ్రామాల్లో సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. గ్రామ, మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ర్యాలీలు నిర్వహించి జయహో కేసీఆర్.. జయహో కిసాన్ సర్కార్.. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ తు.చ తప్పకుండా నెరవేర్చారని అన్నారు. రైతు సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. రైతులను రుణవిముక్తులను చేసిన కేసీఆర్‌కు అండగా ఉంటామన్నారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం