కామారెడ్డి/ఖలీల్‌వాడి, మార్చి 20 : పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 62 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 12,579 మంది (6,127 మంది బాలురు, 6,452 మంది బాలికలు) పరీక్షలు రాయనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు డీఈవో అశోక్ తెలిపారు. మొత్తం రెగ్యులర్ 22,657 మంది విద్యార్థులు (11,418 మంది బాలురు, 11,239 మంది బాలికలు) పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. విద్యార్థులు ఆయా పేజీల్లోనే రాయాలి. పేపర్ లీకేజీని అరికట్టేందుకు ప్రశ్నపత్రాలపై మొదటిసారిగా క్యూఆర్‌కోడ్‌ను ముద్రిస్తున్నారు.