ఆత్మవిశ్వాసం.. పట్టుదల.. ప్రయత్నం..ఎంతటి లక్ష్యాన్నినైనా సాధించే సాధనాలు. తెలంగాణ యువత ఇప్పుడు కొలువుల తొవ్వలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రకటనతో అర్హులైన నిరుద్యోగ యువత ప్రిపరేషన్లో మునిగితేలుతున్నారు. ఏ లైబ్రరీకి వెళ్లినా.. ఏ ఇంట్లో చూసినా.. పుస్తకాలు పట్టుకుని వారే కనిపిస్తున్నారు. గ్రూప్-1, 2, 3, 4తో పాటు ఉపాధ్యాయ, యూనిఫాం సర్వీస్ శాఖల్లోనూ ఖాళీల భర్తీకి ఏర్పాట్లు జరుగుతుండడంతో నిరుద్యోగులంతా పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పోలీసుశాఖ, ప్రభుత్వ విభాగాలు, టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉచితశిక్షణ కేంద్రాల నిర్వహణకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కొలువుల కోలాహలం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చిన ఉగాది పర్వదినం యువతకు ఉద్యోగనామ సంవత్సరంగానే కనిపిస్తున్నది.
-నిజామాబాద్, ఏప్రిల్ 1 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)
ఆత్మవిశ్వాసం.. పట్టుదల.. వీటికి తోడు తపన ఉంటే చాలు ఎంతటి లక్ష్యాన్నినైనా సాధించవచ్చు. ఇప్పుడు ఇదే కోవలో తెలంగాణ యువత పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటించిన కొలువుల భర్తీ ప్రకటనతో అర్హత కలిగిన వారంతా ప్రిపరేషన్లో మునిగి తేలుతున్నారు. గ్రూప్ 1, 2, 3, 4తో పాటుగా ఉపాధ్యాయ, యూ నిఫార్మ్ సర్వీస్ శాఖల్లోనూ ఖాళీల భర్తీకి ఏర్పాట్లు జరుగుతుండడంతో నిరుద్యోగులం తా పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారందరికీ ప్రభుత్వమే అండగా నిలుస్తున్నది. ఓ వైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరోవైపు పోలీస్ శాఖ ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ తీసుకోవడం ఆర్థికంగా భారం కావొద్దనే ఉద్దేశంతో అధికార పార్టీ టీఆర్ఎస్ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుండగా… ప్రభుత్వం కూడా పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నియోజకవర్గానికో సెంటర్‌ను త్వరలోనే నెలకొల్పబోతున్నారు. కొలువుల కోలాహలం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చిన ఉగాది పర్వదినం యువతకు ఉద్యోగనామ సంవత్సరంగానే కనిపిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
కరోనా వైరస్ విజృంభణతో ఇంటి నుంచే చదువులు చాలా మందికి అలవాటయ్యిం ది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్ష శిక్షణ సైతం ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. పోటీ పరీక్షలకు అభ్యర్థులు తమ ఇండ్ల నుంచే శిక్షణ తీసుకుంటున్నారు. కొద్దిమంది శిక్షణ కేంద్రాలకు పరుగులు తీయగా మరికొందరు గత అనుభవాలతో ఆన్లైన్ పాఠాలవైపు మొగ్గు చూపుతున్నారు. నిన్నటి వరకు సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రధానంగా ఎంచుకున్న యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాలవైపు దృష్టి పెడుతున్నారు. ఉద్యోగం దక్కించుకునేందుకు నిరుద్యోగ యువత గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన భారీ నియామక ప్రకటనతో యువత సన్నద్ధతకు సిద్ధమయ్యారు. కేసీఆర్ ఏది సంకల్పించినా ఏది చేసినా పక్కాగా పకడ్బందీగా చేస్తారు. దీనికి తార్కాణం ప్రస్తు తం ఉద్యోగాల భర్తీకి ముందు జరిగిన కసరత్తు. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం కూడా పరాయి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్న దృఢ సంకల్పంతో కార్యాచరణను అమలు చేస్తున్నారు.
తెలంగాణకు గతంలో ముల్కీ రూల్స్ అమల్లో ఉండేవి. తె లంగాణ ప్రజలు ఉద్యమిస్తే 1919లో నిజాం రాజు ఇచ్చిన హక్కు ఇది. ఏపీ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ముల్కీ రూల్స్‌కు అనుగుణంగా పెద్ద మనుషు ల ఒప్పందం అని చెప్పి తర్వాత దాన్ని ఉల్లంఘించారు. ముల్కీ రూ ల్స్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ సవరణ చేసి కాలరాశారు. తెలంగాణకు అన్యాయం చేశారు. ఏపీలో తెలంగాణ కలవడం, ఉద్యమాలు జరగడం, తెలంగాణ ఏర్పడడం జరిగింది. తర్వాత తెలంగాణకు సంబంధించి పటిష్టమైన రాష్ట్రపతి ఉత్తర్వులు కావాలి. శాశ్వత ప్రయోజనం చేకూరాలి. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసి క్యాబినెట్ ఆమోదం తెలిపి తెలంగాణ ప్రభు త్వం పంపింది. దాన్ని కేంద్రం ఏడాదిపాటు పెండింగ్‌లో పెట్టింది. అనేకసార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపి చివరికి రాష్ట్రపతి, ప్రధానిని సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి అడిగితే ఉత్తర్వులు జారీ చేశారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకు దక్కేటట్లు 95శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కేవలం 5శాతం మాత్రమే ఓపెన్ కోటా పెట్టారు. అందులోనూ మనవాళ్లకే 3శాతం ఉద్యోగాలు వస్తాయి. అంటే మొత్తం వందలో 98శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి.
ఎప్పుడు ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారో? రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయో సమగ్రంగా తెలిస్తే ఎంత బాగుంటుంది. నిశ్చింతగా ఉద్యోగాలకు ప్రిపేర్ కావొచ్చు. కోరుకున్న ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అచ్చం ఇలాంటి సమాచారాన్ని సమగ్రంగా తెలిపే వార్షిక ఉద్యోగాల క్యాలెండర్ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నది. ఈ క్యాలెండర్ ప్రకారం ఏటా ఏర్పడే ఖాళీలను సిద్ధం చేసి, క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అన్నింటినీ ఒకేసారి జారీ చేయకుండా, నోటిఫికేషన్లకు మధ్య తగు వ్యవధిని పాటిస్తారు. ఏటా వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో 91వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత నూతన విధానం కార్యరూపం దాల్చబోతున్నది. ఇలాంటి విధానం దేశంలో యూపీఎస్సీ, కేరళ రాష్ర్టాల్లో అమలు చేస్తుండగా తెలంగాణలోనూ అమలుకు నోచుకోబోతున్నది.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా..
విద్యానగర్, ఏప్రిల్ 1: నేను బీటెక్ పూర్తి చేశాను. ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడుతుందనే నమ్మకంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించడంతో గ్రూప్-1, 2 పరీక్షలకు సిద్ధమవుతున్న. రాష్ట్రస్థాయి ఉద్యోగాలతోపాటు సివిల్ సర్వీసెస్‌కు కూడా సన్నద్ధమవుతున్న.
– అఖిల, కామారెడ్డి
ఎస్సై ఉద్యోగం సాధిస్తా..
ఎలాగైనా ప్రభుత్వ ఉద్యో గం సాధించాలనే పట్టుదల తో టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో గ్రంథాలయానికి రోజూ వెళ్లి పోటీ పరీక్షల పుస్తకాలు చదువుతున్న. కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉన్నది.
-బి.స్వామి, కామారెడ్డి
టెట్‌కు ప్రిపేర్ అవుతున్న..
నేను టెట్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నెల రోజుల నుంచి గ్రంథాలయానికి వెళ్లి సంబంధిత పుస్తకాలను చదువుతున్నాను. ఈసారి కచ్చితంగా టీచర్ ఉద్యోగం సాధిస్తాను. ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుండడంతో మాలాంటి నిరుద్యోగులకు కొండంత అండగా నిలిచినట్లయ్యింది.
-ఆనంద్‌బాబు , కామారెడ్డి