నిజామాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుభరోసా పథకం అమలుకు భరోసా లేకుండా పోయింది. ఎన్నికల ముందర గొప్పలు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రిక్త‘హస్తం’ చూపింది. కేసీఆర్ ఇస్తున్న దాని కంటే ఎక్కువే ఇస్తామని ఓట్లేయించుకున్న రేవంత్రెడ్డి.. గద్దెనెక్కాక హామీల ఎగవేతకు తెర లేపారు. ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పిన సర్కారు.. మొదటి రెండు సీజన్లు పెట్టుబడి సాయం చేయకుండాఎగ్గొట్టింది. బీఆర్ఎస్తో పాటు రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మొన్నటి యాసంగిలో రైతుభరోసా పథకాన్ని ప్రారంభించింది. అదికూడా అరకొరగానే అమలు చేసి, సగం మంది రైతులకు ఎగ్గొట్టింది. ఇప్పుడు వానకాలం ప్రారంభం కానుంది. పంట సాగు పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. అయితే, మొన్నటిసారే అంతంత మాత్రంగా పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఈ సీజన్లోనైనా అందరికీ ఇస్తుందా? అసలు రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తుందా.. లేదా? అన్న సందేహం రైతుల్లో వ్యక్తమవుతున్నది.
రైతు డిక్లరేషన్ పేరిట సర్కార్ రైతులను దారుణంగా వంచించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది. రూ.15 వేల రైతుభరోసా, అన్ని పంటలకు మద్దతు ధర, వడ్లకు రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ వం టి హామీలెన్నో ఇచ్చి, ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయకుం డా చేతులెత్తేసింది. రూ.2 లక్షల రుణమాఫీ సగం మం దికీ కాలేదు. రైతుభరోసా రూ.12వేలకు కుదించినా, అది కూడా అందరికీ ఇవ్వలేదు. అన్ని పంటలకు మద్దతు ధర మాటలకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే.. కాంగ్రెస్ వచ్చినంకనే మాకు కష్టాలు మొదలైనయని వాపోతున్నారు.
పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి 2023లో శ్రీకారం చుట్టారు. 2023 వానాకాలంలో నిజామాబాద్ జిల్లాలో 2082 లక్షల మందికి రూ.274 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 2.90 లక్షల మందికి రూ.250 కోట్లు అందించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నాన్నళ్లు మొత్తం 11 విడుతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కానీ, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. రెండు సీజన్లలో రైతుభరోసా పథకాన్ని ఎగ్గొట్టింది. మొన్న యాసంగిలో సగం మందికే పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం.. వానకాలం సాయంపై నోరు మెదపడం లేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూటకోమాట మాట్లాడుతుండటంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. యాసంగికి సంబంధించి ఏప్రిల్లో అందరికీ రైతుభరోసా ఇస్తామని నిజామాబాద్ పర్యటనలోనే తుమ్మల చెప్పారు. మే నెలాఖరు వచ్చినా సగం మందికీ సాయం అందలేదు. తీరా ఇప్పుడు ఉచిత పథకాలంటూ తుమ్మల అక్కసు వెళ్లగక్కడంపై రైతాంగం మండిపడుతున్నది. ఉచితాల పేరిట రైతుభరోసాకు ఎగనామం పెట్టే యోచనలో కాంగ్రెస్ సర్కారు యోచిస్తుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతున్నది. ముందస్తుగానే వర్షాలు పలుకరించడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే ఈ సమయంలోనే పెట్టుబడి సాయం ప్రయోజనమని, లేదంటే అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు.