నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 10 : ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన వీచిన గాలులకు జిల్లా కేంద్రాలతోపాటు పలు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో చాలాచోట్ల పెద్ద వృక్షాలు విద్యుత్ తీగల మీద పడడంతో నగరంలో అంధకారం నెలకొన్నది.
స్థానిక పూలాంగ్ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా, వినాయక్‌నగర్, ఖలీల్‌వాడీ, కోటగల్లీ, గౌతంనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగగా..వాటి కింద నిలిపిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. డిచ్పల్లి, పొతంగల్, చందూర్, బోధన్, శక్కర్‌నగర్, నవీపేట, బాన్సువాడ, లింగంపేట, ఎల్లారెడ్డి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోధన్ పట్టణంలోని 9వ వార్డులో ఇంటి గోడపై చెట్టు పడిపోయింది. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో 30 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ఏఈడీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నాళేశ్వర్ జీపీ కార్యాలయంపై చెట్టు పడిపోవడంతో కొంతమేర గోడ ధ్వంసమైనట్లు గ్రామస్తులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో గాలివాన బీభత్సవానికి భారీ చెట్లు రేకుల షెడ్డుపై కూలిపోవడంతో అక్కడే ఉన్న బోర్గాం విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దుర్మరణం చెందాడు.