ఎల్లారెడ్డి రూరల్, మే 2: డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల కోసం ఎంబీ చేయమంటే డబ్బు లు అడుగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ డీఈఈ గిరిధర్‌కు వ్యతిరేకంగా ఎల్లారెడ్డి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. చివరకు పోలీసులు వచ్చి సర్దిచెప్పగా, వారు శాంతించారు. 2023లో సోమార్పేట్ గ్రామానికి పది డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూయ్యాయి.
అయితే, అప్పటి పంచాయతీరాజ్ ఏఈ కృష్ణ నిర్లక్ష్యంతో వీటికి సంబంధించి ఆన్లైన్ పనులు కాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. దీంతో లబ్ధిదారులు స్థానిక నాయకులు, అధికారుల వెంటపడగా, చివరకు పనులు పునఃప్రారంభమయ్యాయి. రాజంపేట్ మండలానికి చెందిన కాంట్రాక్టర్ బంధం వేణు పేరిట డబుల్ బెడ్రూం ఇంటి పనులు మంజూరు కాగా, అగ్రిమెంట్ ప్రకారం లబ్ధిదారులు తమ సొంత డబ్బులతో ఇండ్లు నిర్మించుకున్నారు.
గత మార్చి 19 నాటికి ఆన్లైన్ పనులు పూర్తయ్యాయి. అధికారులు ఎంబీ చేస్తే తమకు డబ్బులు తమకు వస్తాయని ఆశతో ఉన్న లబ్దిదారులకు నిరాశే మిగిలింది. ఎంబీ చేయాల్సిన అధికారులు చేయకపోగా, చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు. ఈ క్రమంలో స్థానిక నాయకుడు అంజాగౌడ్ శుక్రవారం డీఈఈ గిరిధర్‌ను అడిగితే దురుసుగా ప్రవర్తించారని, డబ్బులు అడిగారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గతంలో బదిలీపై వెళ్లిన ఏఈ కృష్ణతో పాటు ప్రస్తుత ఏఈ పిచ్చయ్యకు, గిరిధర్‌కు కలిపి రూ.లక్షన్నర ఇచ్చామని లబ్ధిదారులు వాపోయారు. ఇంకా లక్షన్నర ఇస్తేనే ఎంబీ చేస్తానని డీఈఈ అంటున్నారని తెలిపారు. గిరిధర్ తీరును నిరసిస్తూ ఎల్లారెడ్డి-హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు.
ఎవరి ఇల్లు వాళ్లు కట్టుకోవాలంటే మా దగ్గిర డబ్బులు లేకున్నా బాకీలు తెచ్చి ఇల్లు కట్టుకున్నం. రెండేండ్లు అయింది. బాకీ ఇచ్చి నోళ్లు ఇండ్ల మీద పడి డబ్బుల కోసం గొడవ చేస్తుండ్రు. సారు ఎంబీ చేస్తే కాంట్రాక్టర్ ఖాతాల పైసలు పడతయి, కాంట్రాక్టరు మాకు వెంటనే ఇచ్చేస్తానన్నడు. కానీ ఈడ సారు డబ్బులిస్తేనే ఎంబీ చేస్త అంటుండు. మాకు న్యాయం చేయాలి.
– చింతకాయల భాగ్య, లబ్ధిదారు
ఇండ్లు కట్టుకోవడానికి మాకు బా కీ ఇచ్చినోళ్ళు డబ్బులు ఇస్తరా.. ఇండ్లు ఖాళీ చేస్తరా? అని గొడవ చేస్తున్నరు. మేము ఇండ్లు ఖాళీ చేస్తే వాళ్లు వచ్చి ఉంటరట. సారే మో ఎంబీ చేస్తలేడు. ఆఫీసు చు ట్టూ తిప్పుకుంటున్నడు. ఎంబీ చేసే దాకా రోడ్డుపైననే కూసుంటం. ఒకయాళ్ల ఇప్పుడు రోడ్డు పైనుంచి లేపేసినా, మాకు న్యాయం జరిగేదాకా రోజూ వచ్చి రోడ్డు మీదనే కూసుంటం.
– క్యాస లక్ష్మి, లబ్ధిదారు
పనులు చేయడానికి డబ్బులు అడిగామన్నది, వాళ్లు ఇచ్చామన్నది అంతా అబద్ధమే. నామీద నిరాధార ఆరోపణలు చేస్తున్నరు. నేను ఎవరినీ డబ్బులు అడగలేదు. నాకు ఎవరూ ఇవ్వలేదు. ఇస్తే వారి దగ్గర ఏదైనా ఆధారముంటే చూయించమనండి. నా పని నేను చేస్తా తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టను
– గిరిధర్, పంచాయతీరాజ్ డీఈఈ