బాన్సువాడ, ఆగస్టు 31: గురుకుల పాఠశాల విద్యార్థిని శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి (12) మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది.
ఇటీవల ఇంటికి వెళ్లిన బాలిక ఈ నెల 27 నుంచి పాఠశాలకు వచ్చింది. గురువారం జ్వరంతో పాటు వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు మందుగోళీలు ఇచ్చి, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. శుక్రవారం మరోసారి వాంతులు చేసుకోగా, వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పాఠశాలకు వచ్చిన బాలిక తల్లి, ఉపాధ్యాయులు కలిసి అంజలిని బాన్సువాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. అయితే, పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే నిజామాబాద్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అంజలి చనిపోయింది.
విద్యార్థిని మృతితో పాఠశాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఘటనపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థిని మృతికి గల కారణాలను ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, బాన్సువాడ ఏరియా దవాఖానకు వెళ్లి వివరాలు సేకరించారు. విచారణ జరుపుతున్నామని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు.