కాంగ్రెస్ పార్టీలో లొల్లి ముదిరింది. ఆధిపత్య పోరు అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. పలు నియోజకవర్గాల్లోని కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డిలో జరుగుతున్న పరిణామాలే అందుకు తాజా ఉదాహరణ. ఇక్కడే కాదు, మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. నేతల మధ్య అంతర్గత వైరం కేడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నది. మరోవైపు, పార్టీలో పాత కాపులను కాదని కొత్త వారికే ప్రాధాన్యం ఇస్తుండడంపై శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఏడాదిన్నర గడిచినా నామినేటెడ్ పదవులు భర్తీ చేయక పోవడంపైనా అసంతృప్తి భగ్గుమంటున్నది. బడా నేతలను ఏదో ఒక పదవిలో సర్దుబాటు చేసి, ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకోక పోవడంపై కార్యకర్తలు రుసరుసలాడుతున్నారు.
– నిజామాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్‌లో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వక పోవడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఏండ్ల తరబడి జెండా మోస్తున్న వారిని కాదని, వేరే పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంపై అసమ్మతి చెలరేగుతున్నది. పార్టీ కోసం సర్వం ధారపోసిన తమకు పదవులు ఇవ్వకపోతే ఎలా అని జిల్లా నేతలు.. పార్టీ ముఖ్యుల దగ్గర వాపోతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జైకొట్టే నాయకులకే పార్టీలో పెత్తనం ఇస్తుండడంపై నిలదీస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చి హడావుడి చేస్తున్న వారిపై పాత తరం నేతలు గుర్రుగా ఉన్నారు. జంపింగ్ జిలానీలను ముఖ్య నాయకులు ప్రోత్సహిస్తుండడం చర్చనీయాంశమైంది. దీంతో సొంత నాయకత్వంపై పాత లీడర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మనుగడలో లేని లీడర్లకు, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతుండడంపై రగిలి పోతున్నారు. దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం, పార్టీలో కొందరి తీరుపై వస్తున్న ఫిర్యాదులతో కాంగ్రెస్ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలకు సమాధానం చెప్పలేక పోతున్నారు. అందుకే డీసీసీ కార్యాలయానికి రావడానికి ముఖ్య నేతలెవ్వరూ ఇష్ట పడడం లేదని తెలిసింది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు, పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కని వారు నిలదీస్తారనే భయంతోనే కీలక నేతలు తప్పించుకు తిరుగుతున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. చివరకు ఆశావహుల ఫోన్లు కూడా లేపడం లేదని పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పారాచూట్ నేతలకు పెద్ద పీట దక్కుతుండటంపై కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్నది. సభలు, సమావేశాల్లో పైసా ఖర్చు పెట్టకుండానే ఫోజులు కొడుతూ చాలా మంది నేతలు హల్చల్ చేస్తుండడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గతంలో కార్పొరేషన్ పదవులు చేపట్టి, స్థానిక సంస్థల్లో కీలక పదవులు అనుభవించి పార్టీ మారిన నేతలు కాంగ్రెస్‌లో తెగ హడావుడి చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో, కామారెడ్డి పట్టణంలో ఈ తరహా జోక్యాన్ని పాత తరం నేతలు జీర్ణించుకోవడం లేదు. తమను నిర్లక్ష్యం చేస్తూ పారాచూట్ లీడర్లకు పెద్దపీట వేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై అసహనంతో ఉన్నారు. గతంలో వివిధ పార్టీల్లో పని చేసిన వారికి పీసీసీలో చోటు కల్పించడంపై మండిపడుతున్నారు. ఇక, అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను భర్తీ చేసి ఉంటే వారి పదవీకాలం దగ్గరికొచ్చేదని, దీంతో మరికొంత మంది నేతలకు అవకాశం దక్కేదని గుర్తు చేస్తున్నారు.