రుద్రూర్, ఆగస్టు 7:మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఎక్కువ మంది రైతులు వరి పంటను సాగుచేశారు. ప్రతి గుంటకూ నీరు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, చెక్డ్యాములను నిర్మించి అన్నదాతకు భరోసా కల్పించింది. పంటల సాగులో రైతన్నలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి సాగులో కలుపు నివారణ సమస్య ఒకటి. నారు వేసిన నాటి నుంచి కలుపు ప్రధాన సమస్యగా మారుతుంది. నారుమడిలో కలుపు కోసం పిచికారీ చేసి, నాటు వేసిన తరువాత కూడా కలుపునివారణ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నాటు వేసే పద్ధతిని బట్టి కలుపు నివారణ చర్యలుచేపట్టాల్సి ఉంటుంది.
నాటు వేసే పద్ధతిలో..
నాటిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు ఎకరానికి బ్యుటాక్లోర్ 1-1.5 లీటర్లు లేదా ప్రెటిల్లాక్లోర్ 500-600 మి.లీటర్లు, ఆక్సాయడార్జిల్ 35-40 గ్రాములు పిచికారీ చేయాలి. బెన్ సెల్పూరాన్ మిథైల్ +ప్రెటిలాక్లోర్ గుళికలు నాలుగు కిలోలు 8-10 రోజుల్లో ఇసుకలో కలిపి చల్లుకోవాలి. 15 నుంచి 20 రోజులకు సైహలోఫాప్ పిబ్యూటైల్ 250-300 మి.లీ నీటిలో కలిసి పిచికారీ చేయాలి. వెడల్పాకు నివారణకు 25 నుంచి 30 రోజులకు 2,4 డీ సోడియం సాల్ట్ అనే మందును ఎకరానికి 500 నుంచి 600 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. దమ్ముచేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతిలో అయితే మూడు నుంచి ఐదు రోజులలోపు ఎకరాకు పెరటిలాక్లోర్+ సెఫ్నర్ మందును 600 నుంచి 800 మిల్లీ లీటర్లు ఇసుకలో కలిపి చల్లాలి. కేవలం వెడల్పాకు కలుపు నివారణకు 2,4డి సోడియం సాల్ట్ 600గ్రాములు విత్తిన 25 నుంచి 30 రోజుల్లో పిచికారీ చేయాలి. శ్రీవరి సాగు పద్ధతిలో సాగు చేయడం ద్వారా పొలంలో నీరు నిల్వకుండా ఉండడంతో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణకు రోటరీ వీడర్తో నాటిన పది రోజులకు ఒకసారి..ఆ తరువాత పది రోజుల వ్యవధిలో మూడుసార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు మట్టిలో కలిసిపోతాయి.ఈ విధంగా కలియబెట్టడం ద్వారా ప్రతిసారి ఎకరాకు 400 కిలోల పచ్చిరొట్ట భూమికి చేరుతుంది. దీంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి.రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు రోటరీ వీడర్తో పని చేసినప్పుడు ఒక్కసారి ఎకరాకు 800 కిలోల అధిక దిగుబడి వస్తుంది.
రసాయనాలను పరిమితంగా వాడాలి
సాధ్యమైనంత వరకు రైతులు కలుపు నివారణకు పరిమితంగా రసాయనాలను వాడుతూ.. వీలైతే అంతర కృషి చేయడం వంటి పద్ధతులు పాటించాలి. దీంతోపాటు సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతి పాటిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. అంతేగాకుండా ఎప్పటికప్పుడు స్థానిక శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉండాలి.
-డాక్టర్ సురేశ్, వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త