ఖలీల్‌వాడీ(మోపాల్), ఫిబ్రవరి 19 : జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే కుట్టేస్తామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే కొందరు దద్దమ్మలు సీఎం కేసీఆర్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఆదివారం ఆయన రూరల్ మండలంలోని న్యాల్కల్లో డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు సిర్పూర్ కోటను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి జిల్లాకు నిధులు మంజూరు చేస్తుంటే, ఎంపీ అర్వింద్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దమ్ముంటే పోటీ పడి పని చేయాలని లేకుంటే నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అర్వింద్ 50 నెలలు దాటినా ఇప్పటివరకు పత్తా లేడన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల, మతాలను రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూరల్ నియోజకవర్గంలో 42 జీపీలు, తండాలకు ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున రూ.8.40 కోట్లు మంజూరుచేసిందన్నారు.
రూరల్ నియోజకవర్గంలో రూ.23 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఏడు మండలాల్లో మండలానికి మూడు వందల మంది చొప్పున సొంత స్థలం ఉన్నవారికి ఇంటినిర్మాణం కోసం రూ.మూడు లక్షలు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. న్యాల్కల్, సిర్పూర్ గ్రామాల్లో శివాజీ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భూమిపూజ చేశారు.
అనంతరం మాట్లాడుతూ ధైర్యం, దేశభక్తి, దైవభక్తి, ధీరత్వానికి మారుపేరు, నవతరానికి ఒక స్ఫూర్తి ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. సిర్పూర్ గ్రామంలో చరిత్ర కలిగిన రాచకోటను పరిశీలించారు. రూ.32 లక్షలతో పర్యాటక కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపారు. అనంతరం దేవాదాయశాఖ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ డీఈ లక్ష్మీనారాయణ, టీపీవో ప్రవీణ్, డీటీసీపీ రాజేంద్రప్రసాద్, అధికారులతో రాచకోట అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నె లతా కన్నీరాం, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శ్రీనివాసరావు, సర్పంచ్ సామ ముత్యంరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ ఉమాపతి, న్యాల్కల్ సర్పంచ్ గంగప్రసాద్, న్యాల్కల్ ఉపసర్పంచ్ సతీశ్‌రావు, దేవాదాయ, డీఈ లక్ష్మీనారాయణ, టీపీవో ప్రవీణ్, డీటీసీపీ రాజేంద్రప్రసాద్, శానిటేషన్ శ్రీకాంత్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.