రైతు ముంగిట్లో ధరణి పోర్టల్ సేవలు

- గతంలో ఎనిమిది చోట్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులు
- ప్రస్తుతం 70 చోట్ల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
- రూపాయి లంచం లేకుండా పూర్తిస్థాయిలో పనులు పూర్తి
- కర్షకుల కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు
నిర్మల్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిర్మల్, భైంసా, ఖానాపూర్, బోథ్, ఆదిలాబాద్, మంచిర్యాల, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఎనిమిది చోట్ల మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో లేవు. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, లక్సెట్టిపేటలో రెండు చోట్ల ఉన్నాయి. మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ముథోల్ నియోజకవర్గానికి సంబంధించి.. భైంసాలో ఉండగా.. మిగతా వాటికి నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 మండలాలు ఉండగా.. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సగటున 8-9 చొప్పున మండలాలున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తానికి ఒకే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉండగా.. దీంతో ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు ఈ ఒక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే ఉంది. ఇక బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు కలిపి మంచిర్యాలలోనే ఉంది. దీంతో ప్రజలకు దూరభారం, వ్యయ ప్రయాస, సమయం వృథా అయ్యేది.
కాసులిస్తేనే పనయ్యేది..
గతంలో వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. దూరభారంతోపాటు వ్యయ ప్రయాసలు ఉండేవి. ఎక్కువ మండలాలతోపాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు, ఇండ్లు, ఆస్తులు, వివాహ రిజిస్ట్రేషన్లు ఒకే చోట చేయడంతో.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎక్కువ రద్దీగా ఉండేవి. స్లాట్ బుకింగ్ చేశాక.. వెంటనే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేది కాదు. ఒక్కో సారి వారం రోజుల సమయం కూడా పట్టేది. ఇక ధ్రువీకరణ పత్రాల్లో అక్షర దోషాలు, తప్పులు ఉంటే.. ఎక్కువ రోజులు పట్టేది. పత్రాలను సరి చేసుకుని వచ్చినా.. ఒకటి రెండు రోజులు తిరిగితే గానీ రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. కాసులు ఇస్తేనే పనులు పూర్తయ్యేది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు డబ్బులు ఖర్చు కావడంతోపాటు.. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు. బస్సులు, వాహన చార్జీలతోపాటు దావత్ ఖర్చులు బాగా అయ్యేవి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. డాక్యుమెంట్లు కూడా నాలుగైదు రోజుల నుంచి వారం రోజులు గడిస్తేగానీ చేతికి వచ్చేవి కావు. ఇక మీ సేవలో దరఖాస్తు చేశాక.. డాక్యుమెంట్లు ఇచ్చిన నెల, రెండు నెలల తర్వాత మ్యుటేషన్ అయ్యేది. మరో నెల రోజులకు పాసుపుస్తకం వచ్చేది.
పనులు సకాలంలో పూర్తి
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములను ధరణి ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు చేస్తున్నది. ఈ నెల 2 నుంచి అన్ని తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో ప్రజలకు సమీపంలో ఉండే ఆయా మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో.. ఎంతో సౌకర్యంగా మారింది. దూరభారం, వ్యయ ప్రయాసలు లేకుండా.. సమయం వృథా కాకుండా సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. తహసీల్ కార్యాలయంలో తెలిసిన అధికారులే ఉండడం.. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి స్లాట్ బుకింగ్ ఉండడం.. మరుసటి రోజే రిజిస్ట్రేషన్లు కావడంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా పనులు పూర్తవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ధరణి ద్వారా తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఒక్కరోజులోనే పట్టా వచ్చింది..
దస్తురాబాద్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ తహసీల్ కార్యాలయం. అధికారు లంతా సమయానికే విధులకు హాజరై వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం 11.30 గంటలకు రిజిస్ట్రేషన్ కోసం మండలంలోని గొడిసెర్యాల గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్ వచ్చాడు. ఆయనతో పాటు అమ్మకందారు రాజేశ్వర్‌గౌడ్ సైతం ఉన్నారు. రమేశ్‌గౌడ్ నాలుగు రోజుల క్రితం 99/3 సర్వే నంబర్లో ఉన్న 1.05 ఎకరాల భూమిని బాబాయ్ రాజేశ్వర్‌గౌడ్ వద్ద కొనుగోలు చేశాడు. దీనిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం స్థానిక మీసేవ కేంద్రంలో రూ.8,512 చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నాడు. బుధవారం సమయం ఇవ్వడంతో వచ్చాడు. కార్యాలయ సిబ్బంది వారిని కొంతసేపు కూర్చోమని చెప్పారు. ఐదు నిమిషాల తర్వాత 11.35 గంటలకు వారిని తహసీల్దార్ పిలిచారు. ఇద్దరి ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు తీసుకున్నారు. స్లాట్‌బుక్ చేసుకున్న పత్రాలను పరిశీలించారు. ఇద్దరికీ క్రయవిక్రయాలు సమ్మత మేనా? ఎవరి ప్రోద్బలం లేదుకదా? అని అడిగారు. దీనికి వారు మా ఇష్టప్రకారమే అమ్మకం, కొనుగోలు చేసుకుంటున్నం సార్.. ఎవరి బలవంతం లేదు అని చెప్పారు. మీతోటి సాక్షులు ఎవరైనా వచ్చారా? అని అడుగగా.. వారిని 11.40 గంటలకు లోపలికి పిలిచారు. దీంతో నరేశ్గౌడ్తో పాటు మరొకరు లోపలికి వెళ్లారు. వారి ఆధార్‌కార్డులు తీసుకొని పరిశీలించారు. పలు వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. పత్రాలన్నీ సరిగా ఉండడంతో వేలి ముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. క్రయవిక్రయదారులు తప్ప మిగిలిన వారు వెళ్లిపోవచ్చని చెప్పడంతో సాక్షులు వెళ్లిపోయారు. 11.50 గంటలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాపీలపై తహసీల్దార్ విశ్వంభర్ సంతకం చేశారు. ఈ ప్రక్రియంతా అరగంటలోనే ముగి సింది. సాంకేతిక సమస్య కారణంగా పట్టారావడం ఆలస్యమవుతుందని రెవెన్యూ సిబ్బంది చెప్పారు. దీంతో కొంతసేపు వారు వేచి ఉన్నారు. సరిగ్గా 12.05 గంటలకు తహసీల్దార్ విశ్వంభర్ రమేశ్‌గౌడ్‌ను లోనికి పిలిచారు. మీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని, పట్టాదారు పాసు పుస్తకం పత్రం అందజేయడంతో రమేశ్ ఆనంద డోలికల్లో మునిగిపోయాడు. 12.10 గంటలకు చిరునవ్వుతో కార్యాలయం నుంచి బయటకు వచ్చాడు.
ఆశ్చర్యం.. ఆనందం..
భైంసా : సమయం 11.10 గంటలు.. భైంసా తహసీల్ కార్యాలయం. అధికారులు, తోటి ఉద్యోగులు విధుల్లో నిమగ్నమయ్యారు. అప్పుడే భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లీకి చెందిన కారిగారి హారిక వచ్చారు. భైంసా శివారులో ఉన్న సర్వే నంబర్ 59లో తాడివార్ విజయ్‌కి వ్యవసాయ భూమి ఉంది. అందులో ఒక ఎకరం భూమిని హారిక కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం సోమవారం మీ సేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకున్నారు. వారికి బుధవారం రిజిస్ట్రేషన్ కోసం సమయం కేటాయించారు. దీంతో హారిక, విజయ్‌తోపాటు సాక్షులు తహసీల్ కార్యాలయానికి వచ్చారు. వీరిని కార్యాలయ ఉద్యోగులు కొంత సేపు కూర్చోమన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రాంచందర్ నాయక్ అమ్మకం, కొనుగోలు దారులను లోపలికి పిలిచారు. వారి ఆధార్, పాన్‌కార్డులను తీసుకొని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూమి అమ్మకం, కొను గోలు విషయంలో ఇద్దరికీ ఎలాంటి వివాదాలు కానీ, బెదిరింపులు కానీ ఉన్నాయా? ఇద్దరికీ ఇష్టముండే లావాదేవీలు చేస్తున్నారా? అని అడిగారు. దీంతో వారు మా ఇష్ట ప్రకారమే చేస్తున్నామని చెప్పారు. మీ వెంట సాక్షులు ఎవరైనా వచ్చారా? వారిని పిలిపించండి అని తహసీల్దార్ వారికి సూచించారు. దీంతో వారు తమవెంట వచ్చిన సాక్షులను పిలిచారు. తహసీల్దార్ వారి ఆధార్ కార్డులు పరిశీలించి.. మీ పేర్లు చెప్పమని అడిగారు. మా పేర్లు కంబోలి సాయినాథ్, విశాల్ అని చెప్పడంతో వివరాలను ఫారంలో నమోదు చేశారు. 11.20 గంటలకు కొనుగోలు, అమ్మకందారులతోపాటు సాక్షుల ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు పరిశీలించారు. ఒకరి వెంట ఒకరివి ఐరిస్, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. సాక్షులు వెళ్లిపోవచ్చని చెప్పడంతో సాయినాథ్, విశాల్ వెళ్లిపోయారు. 11.25 గంటలకే రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ పూర్తయింది. 11.30 గంటలకు హారికను తహసీల్దార్ పిలిచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాపీలను అందించారు. దీంతో హారిక సంతోషంగా కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లింది.
ఇబ్బందులు తప్పినయ్..
ధరణి పోర్టల్ ద్వారా అరగంటలోనే రిజిస్ట్రేషన్ చేసి కొత్తగా ఇచ్చిన పాస్‌బుక్‌లో నా పేరు నమోదైంది. దీనిని తహసీల్దార్ చూపించ డంతో ఆశ్చర్యమేసింది. గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అనేక ఇబ్బందులు పడేటొళ్లు. అడిగినోళ్లకల్లా పైసలు ఇచ్చేటొళ్లట. మీ సేవల నేను రూ.22,900 కట్టిన. పనైపోయినంక ఎన్ని డబ్బు లు కట్టాలి సార్ అడిగిన. ఏమీ అవసరం లేదని సార్లు చెప్పడంతో సంతోషమనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగా ఉండాలి. రైతుల గురించి ఎప్పుడూ ఆలోచించే సీఎం కేసీఆర్ సార్.. గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. - కారిగిరి హరిక, భైంసా, నిర్మల్ జిల్లా
బాధలు తప్పినయ్..
ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ‘నమస్తే’ విలేకరి రమేశ్‌గౌడ్‌ను పిలిచి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా సాగింది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? అని అడిగారు. దీంతో ఆనందం పట్టలేక గబగబ ఇలా చెప్పాడు. “ నేను నమ్మలేకపోతున్న.. ఇంత తొందరగా పట్టా వస్తుందని అనుకోలేదు. ఎక్కడా నయాపైసా ఇవ్వలేదు. ఆన్లైన్ ఫీజు మాత్రమే కట్టిన. గతంలో రిజిస్ట్రేషన్ చేనుకోవాలంటే ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేవాళ్లం. పట్టా కావాలంటే అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగేటోళ్లం. అధికారులు దస్తావేజులు తీసుకొని రేపు, మాపు అంటూ తిప్పుకునేవారు. ప్రయాణంతో పాటు పైసలు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుండే. ఇప్పుడు గ బాధలన్నీ తప్పినయ్. ధరణితో ఒక్క రోజులోనే పట్టా వచ్చింది.. బాధలన్నీ తప్పినయ్. - రమేశ్‌గౌడ్, గొడిసెర్యాల, దస్తురాబాద్
అరగంటనే పట్టింది..
ఆదిలాబాద్‌లో రైతులకు అందుతున్న ధరణి సేవలకు సంబంధించిన ప్రక్రియను తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. ఆదిలాబాద్ రూరల్ తహసీల్ కార్యాలయానికి ఉదయం 11.30కు వెళ్లగా, అధికారులంతా ఉన్నారు. ఉదయం 11. 45 గంటలకు ఆదిలాబాద్‌కు చెందిన కాంబ్లే షీలా కార్యాలయానికి చేరుకున్నారు. యాపల్ గూడకు చెందిన అనుముల ఊషన్నకు చెందిన 4. 14 ఎకరాలను ఆదిలాబాద్‌కు చెందిన షీలా కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సాక్షులతో కలిసి చేరుకుంది. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్నట్లు అధికారులకు తెలిపింది. అప్పటికే సమయం 11. 55 గంటలు అవుతున్నది. దీంతో అధికారులు పరిశీలించి, కొనుగోలుదారు, అమ్మకందారు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు తీసుకున్నారు. పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ తర్వాత సాక్షులతో మాట్లాడి అందరి వేలిముద్రలు బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసుకున్నారు. సమయం 12.20 నిమిషాలకు పాసుపుస్తకం ప్రింట్ తీశారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ ధరణి సేవలను పరిశీలించేందుకు తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు. షీలాకు సంబంధించిన పాస్‌పుస్తకం సిద్ధం కావడంతో తహసీల్ కార్యాలయ అధికారులు కలెక్టర్‌తో ఇప్పించారు. కేవలం అరగంటలోనే ఈ ప్రకియ పూర్తయిందని షీలా కలెక్టర్‌తో సంబురాన్ని పంచుకుంది. చాలా సంతోషంగా ఉందని, ఇంత త్వరగా పని పూర్తవుతుందని అనుకోలేదని ఆనందంగా చెప్పింది. ఆ తర్వాత వేగవంతమైన సేవలు అందించిన తహసీల్ కార్యాలయ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇదే విషయమై కాంబ్లే షీలా, అనుముల ఊషన్నతో మాట్లాడగా, ఇలా స్పందించారు.
గంటన్నర కూడా పట్టలే..
కౌటాల : కౌటాల తహసీల్ కార్యాలయం. బుధవారం ఉదయం 11 గంటలు. సాండ్గాంకు చెందిన నక్క భూదేవి, అదే గ్రామానికి చెందిన అర్కిల్ల విలాస్, అర్కిల్ల దేవానంద్, అర్కిల్ల మురళి, అర్కిల్ల కమలాకర్ కార్యాలయానికి వచ్చారు. ఈ నలుగురికీ నక్క భూదేవి మేనత్త అవుతుంది. మేనత్తకు కట్నం కింద గిఫ్ట్‌డీడ్ ద్వారా భూమిని ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. సాండ్‌గాం శివారులోని అర్కిల్ల విలాస్‌కు చెందిన సర్వే నంబర్ 62/ఎ/ఆ/1లో 0.044 గుంటలు, అర్కిల్ల దేవానంద్‌కు చెందిన సర్వే నంబర్ 62/ఎ/ఆ/2లోని 0.044 గుంటలు, అర్కిల్ల మురళికి చెందిన సర్వే నంబర్ 62/ఎ/ఆ/3లోని 0.044 గుంటలు, అర్కిల్ల కమలా కర్కు చెందిన సర్వే నంబర్ 62/ఎ/ఆ/లోని 0.044 గుంటలు మొత్తం 0.1760 (17 గుంటలు) గుంటల భూమి గిఫ్ట్‌డీడ్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసేందుకు మంగళవారం స్థానిక మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్నారు. బుధవారం సమయమిచ్చారు. నేరుగా తహసీల్దార్ రాజేశ్వరి దగ్గరకు వెళ్లి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. వారి వెంట వచ్చిన సాక్షుల వివరాలు అడిగి.. ఆధార్ కార్డులు తీసుకుని వాటిని పరిశీ లించి ధరణి ఆపరేటర్ మోరాజ్ అహ్మద్ ఖాన్‌కు అందించారు. ఆ తర్వాత బయోమెట్రిక్, ఐరిస్ తీసుకున్నారు. సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నా రు. ఈ నలుగురి నుంచి ప్రక్రియ పూర్తి కావడానికి 50 నిమిషాలు పట్టింది. మరో 10 నిమిషాల్లో పాసు పుస్తకం వస్తుందని చెప్పడంతో వారంతా కార్యాలయం ఆవరణలోనే వేచి ఉన్నారు. ప్రింట్ రావడానికి 20 నిమిషాల సమయం పట్టింది. మధ్యాహ్నం 12.25 గంటలకు భూదేవికి పట్టాదారు పాసు పుస్తకం ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఆఫీస్‌ల చుట్టూ తిరుగుడు తప్పింది
నాకు ఎక్కడ ఎలాంటి భూమి లేదు. మా మేన అల్లుళ్లు అర్కిల్ల విలాస్, అర్కిల్ల దేవానంద్, అర్కిల్ల మురళి, అర్కిల్ల కమలాకర్ వారికున్న భూమిలో నుంచి నాకు 0.1760 గుంటలు ఇస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సార్ మా మండల ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్లు పెట్టిండు అని తెలిసింది. తెలిసినోళ్లను అడిగితే మీసేవ ద్వారా రిజిస్ట్రేషన్ బుక్ చేసుకుంటే పని జల్ది అయితదన్నారు. మంగళవారం చలానా కట్టి స్లాట్ బుక్ చేసినం. ఇది వరకు ఎన్నోసార్లు ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా పనిగాలే. ఇప్పుడు ఇట్లపోయి.. అట్ల వచ్చినం. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
- నక్క భూదేవి, సాండ్‌గాం
పది నిమిషాల్లోనే పట్టా ఇచ్చిండ్రు..
కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పెల్లి గ్రామానికి చెందిన పూరెళ్ల మధునయ్య తనకు చెందిన సర్వే నంబర్ 160లోని 30 గుంటల భూమిని తన కూతురు మాదాసు సునీతకు గిఫ్ట్‌డీడ్(కానుక) ద్వారా అందించాలని భావించాడు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. బుధవారం ఉదయం 11:10 గంటలకు మధునయ్య, తన కూతురు సునీత, ఇద్దరు సాక్షులతో కలిసి కోటపల్లి తహసీల్(సబ్ రిజిస్ట్రార్) కార్యాలయానికి వచ్చారు. అప్పటికే రెవెన్యూ సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడే ఉన్న అటెండర్‌ను కలువడంతో ఆయన తహసీల్దార్ రామచంద్రయ్య చాంబర్లోకి తీసుకెళ్లాడు. భూమిని దానం చేస్తున్న మధునయ్య, భూమిని పొందుతున్న సునీత, సాక్షులతో సబ్ రిజిస్ట్రార్ మాట్లాడాడు. మీ అందరికీ సమ్మతమేనా అని అడిగాడు. వారి వెంట తెచ్చుకున్న భూమి పత్రాలు, స్లాట్ బుకింగ్ రిసిప్టు, ఆధార్, పాన్‌కార్డుల ను పరిశీలించాడు. సబ్ రిజిస్ట్రార్ ఆదేశాలతో ధరణి ఆపరేటర్ తిరుపతి భూమిని దానం చేస్తున్న వారి వేలిముద్రలు బయోమెట్రిక్ ద్వారా, ఫొటోలు, పొందుతున్న వారి ఫొటోలు, వేలి ముద్రలు, సాక్షుల ఫొటోలు, వేలి ముద్రలు ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి కాగా.. సబ్ రిజిస్ట్రార్ లాగిన్లోకి భూమి దానానికి సంబంధించిన వివరాలు రావడంతో వాటిని పరిశీలించి ఒకే చేశాడు. పది నిమిషాల్లోనే మధునయ్య పేరిట ఉన్న 30 గుంటల భూమి తన కూతురు సునీత పేరిట వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో తహసీల్దార్ రామచంద్రయ్య పట్టాపాసు పుస్తకం నకలును సునీతకు అందించాడు.